Road accident : తమిళనాడు (Tamil Nadu) లోని మధురై నగర (Madhurai City) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వారు ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురైలోని అన్నా నగర్ (Anna Nagar) కు చెందిన ప్రకాశ్, అతని బంధువు రమేశ్‌తోపాటు మరో ముగ్గురు మహిళలు కారులో తిరుచిరాపల్లి (Thiruchirapally) లోని ప్రముఖ సమయపురం మరియమ్మన్ (Samayapuram Mariyamman) ఆలయానికి వెళ్లారు.
అమ్మవారి దర్శనం అనంతరం ఆదివారం సాయంత్రం తిరిగి మధురైకి బయలుదేరారు. మార్గమధ్యలో మేలూరు సమీపంలోని అయ్యపట్టి వద్ద హైవేపై వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బ్యారియర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయి, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న కొట్టంపట్టి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు లేదా వాహనంలో సాంకేతిక లోపం వంటి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంతో వారి బంధువుల రోదనలు మిన్నంటాయి.