Chhattisgarh | ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకున్నది. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గ్రామస్తులు కర్రలతో కొట్టి చంపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ఘటన మురళీగూడ సమీపంలోని ఇట్కల్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ కుటుంబం చేతబడి చేస్తున్నట్లుగా అనుమానించిన గ్రామస్తులు.. ఒక్కసారిగా ఆగ్రహించి దారుణానికి పాల్పడ్డారు. హత్య కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఓ కుటుంబ చేతబడి చేయడంతో తమ కుటుంబ సభ్యుడు ఒకరు అనారోగ్యానికి గురయ్యారని ఓ కుటుంబం గ్రామస్తులతో కలిసి కుటుంబంపై దారుణం దాడి చేసింది. కర్రలతో దాడికి పాల్పడడంతో ఐదుగురు మృతి చెందారు. ఘటనను జిల్లా ఎస్పీ చౌహాన్ కిరణ్ గంగారాం ధ్రువీకరించారు. గ్రామస్తులు చేతబడి చేస్తున్నారనే అనుమానం ఉందని.. వారిని హత్య చేసేందుకు గ్రామస్తులు సైతం ఏకమయ్యారని తెలిపారు.
అయితే, బాధిత కుటుంబం కొంతకాలంగా గ్రామస్తుల నుంచి అవమానాలతో పాటు ఇబ్బందులు సైతం ఎదుర్కొంటున్నట్లుగా ప్రాథమికంగా తెలిసిందన్నారు. గ్రామంలో పలువురు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం.. ఈ అనర్థాలకు బాధిత కుటుంబమే కారణంగా పేర్కొంటూ టార్గెట్ చేసినట్లు తెలుస్తున్నది. హత్యకు కారణమైన పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను మౌనం కన్న, మౌసం బుచ్చా, మౌసం బిరీ, కర్క లచ్చి, మౌసం అర్జోగా గురించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ సైతం సందర్శించారు. నిందితులతో పాటు స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో పరిస్థితిని అదుపు చేసేందుకు భారీగా బలగాలను మోహరించారు.