Thane court : అది 32 ఏళ్ల నాటి హత్య కేసు (Murder case). ఆ కేసులో ఐదుగురు నిందితులుగా ఉన్నారు. కేసు విచారణలో తీవ్ర జాప్యం జరగడంతో ఆ ఐదుగురికి అప్పట్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై బయటికి వచ్చిన నిందితులు తప్పించుకోవడంతో ఆచూకీ లభించకుండా పోయింది. దాంతో వారిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అయినా నిందితులు దొరకలేదు. తాజాగా ఆ కేసు విచారణకు రాగా.. కేసుకు సంబంధించిన రికార్డులు చినిగిపోయి ఉన్నాయి. దాంతో థానే కోర్టు (Thane court) ఆ ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.
హత్య కేసులో పత్రాలు కన్పించకపోవడంతోపాటు సరైన సాక్ష్యాలు సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, 1992లో సామ్రాట్ అశోక్‌నగర్‌లో లక్కీ ప్రేమ్‌చంద్ భాటియా అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆ కేసులో నాడు పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే కేసు విచారణలో తీవ్ర జాప్యం జరిగింది. దాంతో నిందితులకు బెయిల్ మంజూరైంది.
ఆ తర్వాత నిందితులు ఆచూకీ లేకుండా పోవడంతో వారి అరెస్ట్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. తాజాగా కల్యాణ్‌లోని అదనపు సెషన్స్ జడ్జి పీఎఫ్ సయ్యద్ కేసును విచారించారు. కేసుకు సంబంధించి ఛార్జిషీట్, సాక్షుల వాంగ్మూలాలు సహా కీలకపత్రాలు చినిగిపోయాయని గుర్తించారు. పోస్టుమార్టం నివేదిక కూడా అందుబాటులో లేని విషయాన్ని తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పారు.