Cheetahs | నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను లార్జర్ ఎన్‌క్లోజర్‌లోకి వదిలే ప్రక్రియను అధికారులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండు మగ చీతాలను క్వారంటైన్ నుంచి బయటకు పంపించారు. లార్జర్ ఎన్‌క్లోజర్‌లోకి వదిలిన 24 గంటల్లోనే అవి తొలి వేటను మొదలుపెట్టినట్లు కూనో నేషనల్ పార్క్ డివిజనల్ ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం తెల్లవారుజామున మచ్చల జింకను రెండు చీతాలు వేటాడినట్లు తెలిపారు. ‘తాము ఊహించిన దాని కంటే వేగంగా చీతాలు తొలి వేటను పూర్తి చేసుకున్నాయి.. మిగిలిన చీతాల్లో ఐదింటిని తర్వలోనే పెద్ద ఎన్ క్లోజర్లోకి వదులుతాం’ అని తెలిపారు.
ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఎనిమిది చీతాలను నమీబియా నుంచి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 17న ఆ ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌కు తరలించారు. అప్పటినుంచి ఆ చీతాలు క్వారంటైన్లో ఉన్నాయి. కాగా, దేశంలో చివరి చీతా 1947లో ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో మరణించింది. దీంతో 1952లో ఈ జాతి అంతరించిపోయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత వీటి ఆనవాళ్లు మన దేశంలో కనిపించలేదు. 74 ఏళ్ల తర్వాత చీతాలు మళ్లీ మన దేశంలోకి వచ్చాయి. మన దేశానికి వచ్చిన చీతాల్లో ఐదు ఆడ చీతాలు, మూడు మగ చీతాలు ఉన్నాయి. వీటి వయసు నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య ఉంది.