న్యూఢిల్లీ: క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీలకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను జారీ చేసింది. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి కంపెనీల వాహనాలను యాప్ ద్వారా బుక్ చేసుకునే మహిళా ప్రయాణికులు మహిళా డ్రైవర్లను ఎంపిక చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రయాణికులు తమ గమ్య స్థానానికి చేరుకున్న తర్వాత డ్రైవర్‌కు టిప్ ఇవ్వవచ్చు. ఈ టిప్ సొమ్ము మొత్తం డ్రైవర్‌కే అందుతుంది. కొత్త నిబంధనల ప్రకారం, క్యాబ్ అగ్రిగేటర్లు తమ యాప్‌లలో స్త్రీ లేదా పురుష డ్రైవర్ (జెండర్)ను ఎంపిక చేసుకునేందుకు తగిన ఫీచర్‌ను పెట్టాలి. అయితే, సేమ్ జెండర్ డ్రైవర్లు అందుబాటులో ఉండటంపై ఈ ఆప్షన్ ఆధారపడి ఉంటుంది.
కొత్త నిబంధనల ప్రకారం, ప్రయాణికులు తమను గమ్యస్థానానికి చేర్చిన డ్రైవర్‌కు టిప్ స్వచ్ఛందంగా ఇవ్వవచ్చు. అయితే, యాప్‌లో ఈ టిప్నకు సంబంధించిన ఆప్షన్ బుకింగ్ సమయంలో కానీ, ట్రిప్ ప్రయాణ సమయంలో కానీ కనిపించదు. ట్రిప్ పూర్తయిన తర్వాత మాత్రమే కనిపిస్తుంది. ప్రయాణికుడు ఇచ్చే టిప్ పూర్తిగా డ్రైవర్ ఖాతాకే వెళ్తుంది.
కంపెనీలు బేస్ ఫేర్‌లో 50 శాతం కన్నా తక్కువ వసూలు చేయవచ్చు. కానీ రద్దీ వేళల్లో (పీక్ అవర్స్) ‘సర్జ్ ప్రైసింగ్’ బేస్ ఫేర్‌కు రెట్టింపు కన్నా ఎక్కువ వసూలు చేయరాదు. ప్రయాణికుడి ఇంటి నుంచి కార్యాలయానికి సాధారణ ఛార్జీ రూ.50 అయినపుడు, రద్దీ సమయంలో రూ.100 కన్నా ఎక్కువ వసూలు చేయరాదు.
పికప్ పాయింట్ వద్దకు వాహనాన్ని తీసుకెళ్లడానికి అయ్యే ఖర్చును (డెడ్ మైలేజ్‌ని) ప్రయాణికుడి నుంచి వసూలు చేయరాదు. ఈ దూరం 3 కి.మీ. కన్నా తక్కువ ఉంటే, ప్రయాణికుడి నుంచి పరిమిత ఛార్జిని మాత్రమే తీసుకోవచ్చు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కంపెనీల లైసెన్స్‌లను రద్దు చేయవచ్చు.