లక్నో: కుమార్తె అత్యాచారానికి గురి కావడం వల్ల కుటుంబానికి చెడ్డపేరు వస్తుందని తల్లి భావించింది. తన ఇద్దరు కుమారులతో కలిసి కుమార్తెను హత్య చేసింది. (Woman Murders Daughter) బెయిల్పై విడుదలైన అత్యాచార నిందితుడు ఆమెను కాల్చి చంపినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 20 ఏళ్ల రింకూ 17 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘజియాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. సెప్టెంబర్ ఆరంభంలో అతడు బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యాడు.
కాగా, సెప్టెంబర్ 18న రాత్రి వేళ తల్లితో కలిసి సోదరుడి బైక్పై వెళ్లిన అత్యాచార బాధిత యువతి గన్ కాల్పుల్లో మరణించింది. అయితే బెయిల్పై విడుదలైన నిందితుడు రింకూ తన కుమార్తెపై ప్రతీకారం తీర్చుకున్నాడని ఆమె తల్లి ఆరోపించింది. అనుచరుడితో కలిసి తన కుమార్తెపై కాల్పులు జరిపి హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రింకూ, అతడి స్నేహితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
మరోవైపు పోలీసులు దర్యాప్తు జరుపగా అసలు విషయం బయటపడింది. కుమార్తె అత్యాచారం కేసు వల్ల
కుటుంబానికి చెడ్డపేరు వస్తుందని యువతి తల్లి ఆందోళన చెందింది. దీంతో ఇద్దరు కుమారులతో కలిసి కుమార్తెను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. సెప్టెంబర్ 18న తల్లితో కలిసి సోదరుడు నీరజ్ బైక్పై వెళ్తున్న ఆ యువతిపై మరో సోదరుడు వినీత్ తన మేనమామ మహావీర్ సహాయంతో గన్తో కాల్పులు జరిపి హత్య చేశాడు.
కాగా, దర్యాప్తులో ఈ విషయం బయటపడటంతో మృతురాలి తల్లి బ్రిజ్వతి, ఆమె కుమారులు నీరజ్, వినీత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు వినియోగించిన దేశీయ పిస్టల్, గుండ్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మహావీర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.