న్యూఢిల్లీ, జూన్ 20: నీట్ రీటెస్ట్ 2026 పరీక్ష ప్రశ్న పత్రం తిరిగి లీకవుతుందేమోనన్న భయం కేంద్రాన్ని వెంటాడుతున్న క్రమంలో ఆదివారం దేశవ్యాప్తంగా, విదేశాల్లోని కొన్ని సెంటర్లలో జరిగే పునః పరీక్షకు అనూహ్య ఏర్పాట్లు చేస్నున్నది. కేంద్రం చేసిన ఏర్పాట్లు చూస్తుంటే యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నది. ముఖ్యంగా ఒక్కో పరీక్షా కేంద్రానికి 40 నుంచి 50 మంది భద్రతా సిబ్బంది, రెండు నుంచి మూడు అంచెల తనిఖీలు, పెద్దయెత్తున సీసీటీవీ కెమెరాల నిఘా, భారీగా సిబ్బంది మోహరింపు చూస్తుంటే కేంద్రం యుద్ధానికి ఏమన్నా సన్నాహాలు చేస్తున్నదా? అనే సందేహాలు ఇటు అభ్యర్థుల్లో, అటు తల్లిదండ్రుల్లో కలుగుతున్నాయి. ఇప్పటికే టెలిగ్రామ్ లాంటి సోషల్ మెసేజింగ్ యాప్‌పై నిషేధం విధించిన కేంద్రం పరీక్ష పేపర్లను వాయుసేన విమానాల ద్వారా ఆయా నగరాలకు తరలించింది. ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందోనన్న భయంతో పరీక్ష సన్నాహాలపై శనివారం దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాక్‌డ్రిల్స్ కూడా నిర్వహించింది.
నీట్ అభ్యర్థులు, తల్లిదండ్రులు ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారంపైనే ఆధారపడాలి తప్ప ఎలాంటి వదంతులు, తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దంటూ ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. న్యాయమైన, సురక్షితమైన, అభ్యర్థి అనుకూలితంగా పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రకటించింది. సామాజిక మాధ్యమాలను అతి దగ్గరగా పరిశీలిస్తున్నామని, పేపర్ లీక్, ఇతర విషయాలపై ఎలాంటి వదంతులు వ్యాపించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పరీక్షలు నిర్వహించే 95 వేల గదుల్లో 1,38,560 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపింది.
ఎలక్ట్రానిక్ పరంగా అక్రమాలు జరగకుండా 51,311 జామర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నది. ఇప్పటికే మోహరించిన పోలీస్, పారా మిలిటరీ బలగాలు, భారత వైమానిక దళం, పోస్టల్ శాఖ సిబ్బందితో పాటు ఆయా రాష్ట్ర, జిల్లా స్థాయి ఉద్యోగుల సేవలను కూడా విస్తృతంగా వినియోగించుకుంటామని వెల్లడించింది. ప్రతి సెంటర్లో 40 నుంచి 50 మంది భద్రతా దళాలను మోహరిస్తామని తెలిపింది. గోప్యమైన సామగ్రిని 1,500 బ్యాంకు శాఖలు భద్రపరుస్తుండగా, దేశ వ్యాప్తంగా సుమారు 700 సేకరణ కేంద్రాల వద్ద ఓఎంఆర్ షీట్ల సేకరణ కోసం పోస్టల్ శాఖ తన బృందాలను సమన్వయం చేస్తున్నది.
ఈ నెల 21న(ఆదివారం) నీట్ యూజీ రీటెస్ట్‌కు ముందు దేశవ్యాప్తంగా ఎన్టీఏ మాక్ డ్రిల్స్ నిర్వహించింది. పరీక్షను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా పోలీసు శాఖలు, జిల్లా పాలనా యంత్రాంగాల సమన్వయంతో బహుళ అంచెల భద్రతా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
నీట్-యూజీ 2026 రీఎగ్జామినేషన్ కోసం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణ కోసం దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 5,000కుపైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 2 లక్షల మందికిపైగా సిబ్బందిని మోహరించినట్లు ఎన్టీఏ పేర్కొన్నది. పెన్ను-పేపర్ విధానంలో నిర్వహించే ఈ పరీక్ష మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.15 వరకు జరుగుతుంది. దివ్యాంగులు(పీడబ్ల్యూడీ), ప్రామాణిక వైకల్యాలు గల వ్యక్తులు(పీడబ్ల్యూబీడీ) వంటి వర్గాలకు చెందిన అభ్యర్థులకు పరిహార సమయం ఇవ్వనున్నారు. సాయంత్రం 6.20 గంటల లోపు పరీక్షను పూర్తి చేయవచ్చు.
నీట్ ప్రశ్న పత్రాల లీకేజీని నిరసిస్తూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శనివారం రెండోసారి నిరసనలకు దిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా తాము నిరసనలు కొనసాగిస్తామని అభిజీత్ దీప్కే వెల్లడించారు. కానీ ఢిల్లీ పోలీసులు నిరసనలు కొనసాగించడానికి అనుమతించలేదు. పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న యువత మొబైల్ ఫోన్ల లైట్లలోనే నిరసనలు కొనసాగించింది. జంతర్ మంతర్ వద్దకు ఢిల్లీ పోలీసులు కావాలనే ఆహారం, నీరు అనుమతించట్లేదని దీప్కే ఆరోపించారు. గాంధీజీకి కూడా ఇలాంటివి ఎన్నో ఎదురయ్యాయని.. తమ పోరాటం కూడా అలాంటిదే అన్నారు. జంతర మంతర్ వద్ద వీధిలైట్లు వేయాలని, ఆహారం, నీరు అనుమతించాలని ఆయన కోరారు.
నీట్ ఎగ్జామ్ లీక్ అయినప్పటి నుంచి స్టూడెంట్ల ఆత్మహత్యలు ఆగట్లేదు. ఇప్పటికి 12 మంది చనిపోయారు. నీట్ రీటెస్టుకు కొన్ని గంటల ముందు మరో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివసిస్తున్న కడప జిల్లాకు చెందిన సనా అనే యువతి శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.ఆమె కుటుంబం హైదరాబాద్‌లో ఉండగా తండ్రి జాఫర్ కువైట్‌లో ఉంటున్నారు. అలాగే యూపీలోని ఘజియాబాద్‌లోని విజయ్ నగర్లో నివాసం ఉంటున్న జతిన్ కుమార్ (22) నీట్‌కు సిద్ధపడుతూ వత్తిడి భరించ లేక ఉరేసుకుని చనిపోయాడని పోలీసులు గుర్తించారు. సూసైడ్‌కు ముందు అతను ఓ వీడియో రికార్డు చేశాడు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నివాసం ఉంటున్న 21 ఏండ్ల అవంతిక మౌర్య తాము అద్దెకు ఉంటున్న బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఆమె మూడేండ్ల నుంచి నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నది. ఒత్తిడి తట్టుకోలేక బిల్డింగ్‌పై నుంచి దూకేసిందని ఆమె తండ్రి తెలిపాడు. గురువారం రాత్రి ఆమె దూకేయగా.. ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం ఉదయం మరణించింది.
నీట్-యూజీ రీఎగ్జామినేషన్‌కు ఒకరోజు ముందు అభ్యర్థులకు సరీక్షా సెంటర్ల కేటాయింపునకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పలు విమర్శలను ఎదుర్కొంటున్నది. కొంతమంది అభ్యర్థులకు వారి సొంత నగరాలకు దూరంగా ఉన్న పరీక్షా కేంద్రాలను కేటాయించగా అందులో ఒకరికి వేరే దేశాన్నే కేటాయించడం విశేషం. నాగ్‌పూర్‌కు చెందిన అబ్లుల్లా మొహమ్మద్ తాలీబ్ అనే అభ్యర్థి శుక్రవారం తన అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోగా యూఏఈ రాజధాని అబుదాబీలోని ఒక భారతీయ పాఠశాల పరీక్షా కేంద్రంగా ఉండటం చూసి అవాక్కయ్యాడు. అడ్మిట్ కార్డ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఈ విషయం వైరల్ అయింది.
ఈ వివాదంపై ఎన్టీఏ స్పందిస్తూ విద్యార్థికి సంబంధించిన నమోదిత లాగిన్ వివరాల ద్వారానే పరీక్ష నగరాన్ని మార్చినట్లు తెలిపింది. అభ్యర్థి అభ్యర్థన మేరకు పరీక్షా కేంద్రాన్ని తిరిగి నాగ్‌పూర్‌కు ఎన్టీఏ మార్చింది. మరో అభ్యర్థి విషయాన్ని చూస్తే భువనేశ్వర్‌లో ఉంటున్న అభ్యర్థికి అక్కడకు దాదాపు 2,300 కిలోమీటర్ల దూరంలోని డెహ్రాడూన్‌లో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. ఈ విషయాన్ని ఎన్టీఏ దృష్టికి అభ్యర్థి తీసుకురాగా వెంటనే పరీక్షా కేంద్రాన్ని సవరిస్తూ చర్యలు తీసుకున్నది.