Pathanjali Products : ప్రముఖ యోగా గురు (Yoga Guru) బాబా రాందేవ్ (Baba Ramdev) కు చెందిన పతంజలి బ్రాండ్ (Pathanjali Brand) ఉత్పత్తులకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షాకిచ్చింది. నివారణ అంటూ తప్పుదోవ పట్టించే, అభ్యంతరకరమైన ప్రకటనలు ఇస్తున్నారన్న ఆరోపణలతో ఎఫ్‌డీఏ రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించి భారీగా మందులను స్వాధీనం చేసుకుంది. సీజ్ చేసిన ఆయుర్వేద (Ayrveda), అల్లోపతి (Allopathy) మందుల విలువ సుమారు రూ.73.24 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఈ మందుల్లో పతంజలి బ్రాండ్‌తో విక్రయిస్తున్న ఉత్పత్తులు కూడా ఉన్నాయి.
డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు ఎఫ్‌డీఏ వెల్లడించింది. ముంబై, కొంకణ్, పుణె, నాసిక్, అమరావతి, నాగ్‌పుర్, ఛత్రపతి శంభాజీనగర్ డివిజన్లలో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పతంజలి బ్రాండ్ కింద మార్కెటింగ్ చేస్తున్న, హరిద్వార్‌లోని దివ్య ఫార్మసీ తయారు చేసిన మందులను కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా నాగ్‌పూర్ డివిజన్లో రూ.7,26,755 విలువైన మందులను, నాసిక్ డివిజన్లో రూ.7,10,945 విలువైన స్టాక్‌ను సీజ్ చేసినట్లు అధికారులు వివరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఎఫ్‌డీఏ స్పష్టంచేసింది.