లక్నో: చెడు సహవాసం పట్టిన కొడుకును తండ్రి మందలించాడు. ఆస్తి ఇవ్వబోనని, ఇంటి నుంచి వెళ్లగొడతానని హెచ్చరించాడు. దీంతో ఆ కుమారుడు తండ్రిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. స్నేహితులతో కలిసి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. కోటి విలువైన డబ్బు, నగలను చోరీ చేశాడు. (Teen Steals Rs.1 Crore From Own House) ఫిర్యాదు అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. పాంకి ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త బట్టలకు రంగులు వేసే ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నాడు. పదో తరగతి చదువుతున్న అతడి కుమారుడు తన స్నేహితులతో చెడు సహవాసం చేస్తున్నాడు. చెడ్డ పనులతో దారి తప్పుతున్నాడు.
కాగా, కొడుకు తీరుపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెడు సహవాసాలు మానకపోతే ఆస్తి ఇవ్వబోనని, వీలునామా రద్దు చేస్తానని, ఇంటి నుంచి పంపివేస్తానని కుమారుడ్ని హెచ్చరించాడు. దీంతో తండ్రిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ యువకుడు ప్లాన్ వేశాడు. ఫిబ్రవరి 27న ఆరుగురు స్నేహితులతో కలిసి సొంత ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. రూ.20 లక్షల నగదు, రూ.80 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించాడు.
మరోవైపు కోటి విలువైన డబ్బు, నగలు చోరీపై ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ఇంటితోపాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. మైనర్ బాలుడైన వ్యాపారి కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని జువైనల్ హోమ్‌కు తరలించారు.
కాగా, ఈ చోరీకి సంబంధించి మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. రూ. 4 లక్షల నగదు, 165 గ్రాములకు పైగా బంగారం, 3 కిలోలకు పైగా వెండిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. వారి అరెస్ట్‌తో చోరీ చేసిన మిగతా నగదు, నగలు స్వాధీనం చేసుకుంటామని వివరించారు. నిందితుల్లో ఇద్దరు గతంలో చోరీ కేసులో అరెస్టైనట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.