Fiber Optics | న్యూఢిల్లీ: వివిధ వాహకాలపైకి ఇన్ఫర్మేషన్ను ఎన్కోడ్ చేయడంపై ఆధునిక కమ్యూనికేషన్ ఎక్కువగా ఆధారపడుతున్నది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా లేజర్ కాంతిని ప్రసారం చేయడం అత్యంత సాధారణ విధానం. డాటా ట్రాన్స్మిషన్ కోసం డిమాండ్ పెరుగుతుండటంతో మరింత సమర్థవంతమైన ఎన్కోడింగ్ టెక్నిక్స్ అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆల్టో విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు డాటా సామర్థ్యాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో పెంచే విధానాన్ని కనుగొన్నారు. కాంతి శక్తిని సుడి గుండాలుగా సృష్టించడమే ఈ విధానం. సుడిగుండం (వోర్టెక్స్) తిరగడం, సమరూపత (సిమెట్రీ) మధ్య సంబంధం గురించి పరిశోధన నిర్వహించినట్లు రీసెర్చర్ పైవి టోర్మా చెప్పారు.
ఎలాంటి సమరూపత (సిమెట్రీ)తో ఎలాంటి కాంతి శక్తి సుడి గుండాలను సృష్టించగలం? అనే అంశంపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. తాము రూపొందించిన క్వాసీక్రిస్టల్ డిజైన్ క్రమత్వం, కల్లోలం మధ్య సగం దూరంలో ఉందన్నారు. ఇది సమాచారాన్ని తీసుకెళ్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న పరిమితులను అధిగమించి ఈ విధానాన్ని రూపొందించినందు వల్ల ఎంతటి సంక్లిష్టమైన కాంతి సుడిగుండాలనైనా సృష్టించడానికి మార్గం సుగమం అయింది. ఈ టెక్నాలజీ వల్ల ఫైబర్ ఆప్టిక్ డేటా కెపాసిటీ 8 నుంచి 16 రెట్లు పెరుగుతుందని ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తున్నది.