కురుక్షేత్ర: హర్యానా శాసన సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని రైతు సంఘాలు ఆదివారం పిలుపునిచ్చాయి. సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో పలు రైతు సంఘాలు పిప్లిలో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్‌లో ఈ నిర్ణయం తీసుకున్నాయి. వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి తమ డిమాండ్ల సాధన కోసం వచ్చే నెల 3న దేశవ్యాప్తంగా రైల్ రోకో నిర్వహించాలని కూడానిర్ణయించాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చిన రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైతు నేత సర్వన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ, హర్యానాలో బీజేపీ దురాగతాలకు ప్రతీకారం తీర్చుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు.