Farmers Protest | సమస్యల పరిష్కారం కోసం అన్నదాతలు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హర్యానా, ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రధాన రోడ్లపైకి రావద్దని హర్యానా పోలీసులు హెచ్చరించారు. అంబాల, సోనిపట్, పంచకుల్లో సెక్షన్ 144 విధించారు. 50 కంపెనీల కేంద్ర బలగాలను సిద్ధంగా ఉంచారు.
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. పంజాబ్, హర్యానా నుంచి రైతులు నగరంలోకి ప్రవేశించకుండా ప్రధాన మార్గాల్లో క్రేన్లు, కంటెయినర్లను సిద్ధం చేశారు. ఒకవేళ రైతులు నగరంలోకి రావాలని ప్రయత్నిస్తే వాటితో సరిహద్దులను మూసివేస్తామని తెలిపారు. ఈ నెల 13న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నదాతలు పిలుపునిచ్చారు.
దాదాపు 200 రైతు సంఘాలు ఈ ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. పంటలకు కనీస మద్దతు ధర సహా పలు ఇతర సమస్యలను పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా తదితర సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం ఓ వైపు చర్చలకు పిలుస్తూనే హర్యానాలో తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దాలెవాల్ ఆరోపించారు.
పోలీసులు సరిహద్దులను మూసేశారని, 144 సెక్షన్ విధించారని, ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారని జగ్జిత్ విమర్శించారు. అసలు ప్రభుత్వానికి ఈ అధికారం ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరగవని, ప్రభుత్వం ఈ అంశంపై దృష్టిపెట్టాలని అన్నారు.