(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఫిబ్రవరి 9: పంటలను నాశనం చేస్తున్న వీధి పశువులను యూపీ రైతులు ప్రభుత్వ పాఠశాలల్లోకి తోలడంపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. యూపీ ప్రభుత్వం వీధి పశువుల బెడద తప్పించటానికి గోశాలలు స్థాపించి, ప్రతి పశువుకు పోషణకు నిధులు మంజూరు చేసే పథకాన్ని అమలు చేస్తున్నది. కానీ సరైన సమయంలో నిధులు విడుదల చేయకపోవడంతో గోశాలలు, సంరక్షణ నిర్వాహకులు ఆయా పశువుల నిర్వహణను గాలికొదిలేస్తున్నారు.
దీంతో ఆ పశువులు ఆహారం కోసం పంటపొలాల దారి పడుతున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. దాంతో వీధి పశువుల నుంచి తమ పంట పొలాలను కాపాడుకోవటానికి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. రైతులపై కేసులు నమోదు చేస్తుండటంపై భారతీయ కిసాన్ యూనియన్ (టికాయిత్) ఆధ్వర్యంలో బినోర్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు ట్రాక్టర్లతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.