అంబాలా, డిసెంబర్ 16 : హర్యానా సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు సోమవారం అంబాలా జిల్లాలో ట్రాక్టర్ మార్చ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం జిల్లాలోని 12 గ్రామాల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు, పెద్ద సంఖ్యలో ఎస్ఎంఎస్లు పంపడాన్ని నిలిపేసింది. మరోవైపు తమ ప్రణాళిక ప్రకారం మంగళవారం పంజాబ్ వ్యాప్తంగా రైల్ రోకో నిర్వహించనున్నట్టు రైతు నేత సర్వన్ సింగ్ పంఢేర్ తెలిపారు. ‘రాష్ట్రంలోని 13 వేల గ్రామాల ప్రజలందరూ తమ నివాసాలకు సమీపంలోని రైల్వే క్రాసింగ్లు, రైల్వే స్టేషన్ల వద్ద మధ్యాహ్నం 12-3 గంటల సమయంలో రైల్ రోకో నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన అన్నారు. విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆయన పార్టీ తరపున రైతులకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని పంఢేర్ ఆరోపించారు.
రైతుల సమస్యలను కేంద్రం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 21 రోజులుగా ఖనౌరీ సరిహద్దులో నిరాహార దీక్ష చేస్తున్న పంజాబ్ రైతు నేత జగ్జీత్ సింగ్ ధల్లేవాల్(70) ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు తెలిపారు. ఆయనను వెంటనే దవాఖానలో చేర్పించాలని సూచించారు. అయితే ధల్లేవాల్ మాత్రం చికిత్సకు నిరాకరించారు. రైతుల డిమాండ్ల సాధన కోసం, వారి ఆత్మహత్యల నివారణ కోసం ఆత్మార్పణకైనా సిద్ధమని ప్రకటించారు. ధల్లేవాల్ సొంతంగా నిలబడలేకపోతున్నారని.. ఆయనకు గుండెపోటు వచ్చే అవకాశం ఉందని, క్రియాటినైన్ స్థాయిలు పెరిగాయని వైద్యుల బృందం పేర్కొంది.