Viral News | అంత్యక్రియలు జరిగిన 15 రోజుల తర్వాత ఓ వ్యక్తి సజీవంగా కనిపించాడు. తమ కుమారుడు చనిపోయాడని భావించి అంత్యక్రియలు నిర్వహించగా.. తాజాగా జైలు నుంచి ఫోన్ కాల్ రావడంతో అతను బతికే ఉన్నాడని తెలిసింది. పంజాబ్లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
పంజాబ్లోని కపుర్తలాకు చెందిన రవి కుమార్ అనే యువకుడు ఆగస్టు 5న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. తండ్రి, సోదరుడు తమకు తెలిసిన ప్రాంతాల్లో గాలించినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో ఆగస్టు 11న కపుర్తలా సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మిస్సింగ్ కేసు నమోదు చేయించారు. ఇదిలా ఉండగా ఓ యువకుడి కాలిపోయిన మృతదేహం లభించినట్లు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహానికి సంబంధించిన ఫొటోలను వారికి చూపించారు. కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు ఆ మృతదేహాన్ని రవి కుమార్దేనని గుర్తించారు.
దీంతో తమ కుమారుడు ఇక లేడని భావించిన కుటుంబం ఆగస్టు 13న అతడి అంత్యక్రియలు నిర్వహించింది. తదననంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. ఇలా అంత్యక్రియలు పూర్తయి దాదాపు 15 రోజులు గడిచాయి. సెప్టెంబర్ 2న కుటుంబ సభ్యులకు సెంట్రల్ జైలు సిబ్బంది నుంచి ఫోన్ వచ్చింది. ‘రవి కుమార్ అనే వ్యక్తి మా జైలులో ఉన్నాడు’ అని వారు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
అసలు విషయం ఏంటో తెలుసుకునేందుకు మరుసటి రోజు వారు కపుర్తలా సెంట్రల్ జైలుకు వెళ్లారు. అక్కడ రవి కుమార్ను స్వయంగా చూసిన తర్వాతే వారికి నమ్మకం కలిగింది. చనిపోయాడనుకున్న కుమారుడు తమ కళ్లముందు సజీవంగా కనిపించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అసలేం జరిగిందంటే.. రవి కుమార్ను జలంధర్ పోలీసులు సుమారు నెల రోజుల క్రితం లోయిటరింగ్ (అనుమానాస్పదంగా సంచరించడం) సంబంధిత కేసులో అరెస్టు చేసినట్లు ప్రాథమిక సమాచారం. అనంతరం అతడిని కపుర్తలా సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఇదే సమయంలో మరో వ్యక్తి మృతదేహాన్ని రవి కుమార్దిగా కుటుంబం గుర్తించడం, అతడికి అంత్యక్రియలు నిర్వహించడం ఇప్పుడు పలు ప్రశ్నలకు తావిస్తోంది. మృతదేహాన్ని గుర్తించడంలో పొరపాటు ఎలా జరిగింది? అసలు ఆ మృతదేహం ఎవరిది? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. చనిపోయాడని కన్నీళ్లు పెట్టుకున్న కుటుంబానికి.. 15 రోజులకే సజీవంగా తిరిగి కనిపించిన రవి కుమార్ ఉదంతం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.