Family deaths : మహరాష్ట్ర (Maharastra) కు చెందిన ఓ కుటుంబం తిన్న పుచ్చకాయ (Watermelon) లో ఎలాంటి కల్తీ లేదని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు తెలిపారు. పుచ్చకాయల శాంపిళ్లను పరీక్షించగా అందులో ఎలాంటి కల్తీ లేదని తేలిందని అన్నారు. అయితే ఇంకా బ్యాక్టీరియా పరీక్షలు (Bacteria Tests) చేయలేదని, వారు తిన్న ఆహారంలో హానికర బ్యాక్టీరియా ఉందేమోనన్న అనుమానాలను కొట్టిపారేయలేమని చెప్పారు.
మహారాష్ట్రలో ఇటీవల ఓ కుటుంబం బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత కొన్ని గంటలకే ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. వీరి మరణాలపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారు తిన్న పుచ్చకాయలో ఎలాంటి కల్తీ జరగలేదని పరీక్షల్లో తేలింది. కానీ మృతుల్లో కొందరి శరీర అవయవాలు ఆకుపచ్చగా మారడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ముంబైకి చెందిన అబ్దుల్లా డోకాడియా, ఆయన భార్య నస్రీన్, ఇద్దరు కుమార్తెలు ఆదివారం తెల్లవారుజామున వాంతులు, విరేచనాలతో ఉన్నట్టుండి ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరణానికి కొన్ని గంటల ముందు శనివారం రాత్రి వారు బిర్యానీ, పుచ్చకాయ తిన్నారు. దాంతో ఫుడ్ పాయిజన్ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలోనే పుచ్చకాయ, ఆహార పదార్థాల శాంపిళ్లను ఎఫ్‌డీఏ అధికారులు పరీక్షించారు.
వారు తిన్న ఆహారంలో కల్తీ జరగలేదని పరక్షల్లో తేలింది. పుచ్చకాయలోనూ ఎలాంటి సింథటిక్ రంగులు గానీ, తియ్యదనం కోసం ఉపయోగించే కృత్రిమ రసాయనాల ఆనవాళ్లు గానీ లభించలేదని అధికారులు వెల్లడించారు. అయితే ఇంకా బ్యాక్టీరియా పరీక్షలు చేయలేదని, కాబట్టి వారి మరణానికి బ్యాక్టీరియా కూడా కారణమై ఉండొచ్చనే అనుమానాలను కొట్టిపారేయలేమని చెప్పారు. లేదంటే ఏవైనా విష పదార్థాలు తిని మరణించి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు.
మరోవైపు మృతుల పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు తెలిశాయి. మృతుల్లో కొందరి అవయవాలు రంగు మారాయని అధికారులు గుర్తించారు. మెదడు, గుండె, జీర్ణాశయంలో కొంతభాగం ఆకుపచ్చ రంగులోకి మారినట్లు తెలిసింది. సాధారణ ఫుడ్ పాయిజన్‌లో ఇలా జరగదని, ఏదైనా విషప్రయోగం జరిగి ఉండొచ్చనే దానికి ఇది సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇక అబ్దుల్లా డోకాడియా శరీరంలో మార్ఫిన్ అనే శక్తిమంతమైన ఓపియాడ్ను గుర్తించామని, సాధారణంగా అలాంటి పెయిన్ కిల్లర్‌ను వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇస్తారని అధికారులు చెప్పారు. అబ్దుల్లా ఏదైనా చికిత్సలో భాగంగా ఆ మెడిసిన్ తీసుకున్నారా..? లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఆయనకు దాన్ని ఇచ్చారా..? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.