IIT | న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఐఐటీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అంటే ఓ పండుగ వాతావరణం నెలకొనేది. దేశ విదేశాలకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు ఐఐటీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం క్యూ కట్టేవి. ఇప్పుడా పరిస్థితుల్ని ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం తలకిందులు చేసింది. ఐఐటీల్లో డిసెంబర్ 1న ప్లేస్మెంట్ డ్రైవ్ మొదలుకాగా, వేలాది మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు అనుకున్న విధంగా ఆఫర్లు రాలేదు. క్రితం ఏడాదితో పోల్చితే ఆఫర్ల సంఖ్యలో 15 నుంచి 30 శాతం తగ్గుదల నమోదైందని ‘ఎకనామిక్ టైమ్స్’ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ఉదాహరణకు ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో గత ఏడాది ఐదుమార్లు ప్లేప్మెంట్ డ్రైవ్స్ చేపట్టగా..వచ్చిన ఉద్యోగ ఆఫర్ల సంఖ్య 1300. ఈసారి 7సార్లు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించినా..ఆఫర్లు కేవలం 1181కు పరిమితమయ్యాయి. అలాగే ఐఐటీ-బీహెచ్‌యూలో గత ఏడాది నాలుగు రోజులపాటు ప్లేస్మెంట్ డ్రైవ్ చేపట్టగా ఆఫర్ల సంఖ్య 1000 దాటింది. కానీ ఈసారి ఆఫర్లు 850లోపే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా మొత్తం 23 ఐఐటీలున్నాయి. ఢిల్లీ, బాంబే, కాన్పూర్, మద్రాస్, ఖరగ్‌పూర్, రూర్కీ, గువహటి, వారణాసి (బీహెచ్‌యూ) నగరాల్లోని ఐఐటీలు పేరొందినవి. ఇక్కడ ఈసారి జరిగిన ప్లేస్మెంట్ డ్రైవ్ విద్యార్థుల్ని తీవ్రంగా నిరాశపర్చింది. ఎంతో ప్రతిభా పాటవాలుంటే కానీ ఓ విద్యార్థి ఈ ఐఐటీల్లో సీటు పొందలేడు. అలాంటిది..కంప్యూటర్ సైన్స్ విభాగంలో సింగిల్ ఆఫర్ కూడా రాని విద్యార్థులున్నారు. ‘సహజంగా 8 నుంచి 10 మందిని ఎంపిక చేసుకునే రిక్రూట్మెంట్ సంస్థలు ఈసారి ఒకరు లేదా ఇద్దరితో ముగించాయి. మరికొన్ని సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్లో పాల్గొ న్నా, నియామకాలు జరపలేదు’ అని ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి ఒకరు వాపోయారు.
ముఖ్యంగా ఐటీ రంగంలో ఇప్పుడున్న పరిస్థితులు మరో మూడు త్రైమాసికాల వరకు కొనసాగుతుందని ‘ఫౌండిట్’ జాబ్ పోర్టల్ సీఈవో శేఖర్ గరిసా అన్నారు. ఐఐటీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంత దయనీయంగా మారడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యమేనని నిపుణులు చెబుతున్నారు. టెక్, కన్సల్టెంగ్, సర్వీస్, ఐటీ..తదితర రంగాలు ప్రభావితమయ్యాయని తెలిపారు. ఆర్థిక మార్పులు, భౌగోళిక రాజకీయ ఆర్థికపరమైన ఆందోళనలు, మాంద్యం భయాలు.. ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టాయని పేర్కొన్నారు.
ఢిల్లీ, బాంబే, కాన్పూర్, మద్రాస్, ఖరగ్‌పూర్, రూర్కీ, గువహటి, వారణాసి..ఐఐటీల్లో ఈ ఏడాది ప్లేస్మెంట్ డ్రైవ్ జరిగిన తీరు విద్యార్థుల్ని ఆందోళనకు గురిచేసింది. ‘ఇక్కడ ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఫైనల్ ఇయర్ విద్యార్థికి ఉద్యోగం ఆఫర్ చేసేందుకు పలు కంపెనీలు పోటీ పడేవి. ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా నెమ్మదించింది. కంపెనీలు గతంలో నిజంగానే నియామకాలు జరిపాయా? అన్న సందేహం విద్యార్థుల్లో కలుగుతున్నది’ అని ఓ ఐఐటీ విద్యార్థి అన్నారు.
దేశంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ ప్లేస్మెంట్లు బాగా తగ్గిపోయాయి. తాజా రిక్రూమెంట్ పట్ల కంపెనీలు సుముఖంగా లేవని బీఎంఎల్ ముంజాల్ యూనివర్సిటీ కెరీర్ సెంటర్ సీనియర్ డైరెక్టర్ సంతానిల్ దాస్‌గుప్తా అన్నారు. ఎరోనాటిక్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యునికేషన్స్, ఎలక్ట్రానిక్స్..తదితర విభాగాల్లో రిక్రూట్మెంట్స్ గణనీయంగా పడిపోయాయని ఆయన తెలిపారు. గత ఏడాది 63 శాతం మంది విద్యార్థులకు ప్లేస్మెంట్ దక్కితే, ఈసారి అది 20-25 శాతానికి పరిమితమైందన్నారు. అమైటీ యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్ డిప్యూటీ డైరెక్టర్ అంజనీ కుమార్ భట్నాగర్ మాట్లాడుతూ, దాదాపు అన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇదే పరిస్థితి ఉందని, కేవలం 30 శాతం మంది విద్యార్థులకే ఆఫర్లు దక్కుతున్నాయని చెప్పారు.