న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ లాయర్ల (fake lawyers) సంఖ్య పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) దీనిపై దృష్టిసారించింది. గత ఐదేళ్లలో ఒక్క ఢిల్లీలోనే107 మంది నకిలీ న్యాయవాదులను తొలగించింది. లాయర్ల సమగ్రత, వృత్తి నైపుణ్యాన్ని కొనసాగించడానికి ఈ డ్రైవ్ చేపట్టినట్లు బార్ కౌన్సిల్ తెలిపింది. ఇందులో భాగంగా 2019 నుంచి 2024 అక్టోబర్ వరకు ఢిల్లీలో 107 మంది నకిలీ లాయర్లను తొలగించినట్లు పేర్కొంది. ఈ నిర్ణయాత్మక చర్య ద్వారా నకిలీ న్యాయవాదులను, చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేని వారిని తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు బార్ కౌన్సిల్ తెలిపింది. అక్టోబర్ 26న ఈ మేరకు ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది.
కాగా, ప్రజల విశ్వాసాన్ని, అనైతిక పద్ధతుల నుంచి న్యాయ వ్యవస్థను రక్షించడానికి బార్ కౌన్సిల్ ప్రయత్నిస్తున్నదని బీసీఐ కార్యదర్శి శ్రీమంతో సేన్ తెలిపారు. ఇందులో భాగంగా ఒక్క ఢిల్లీలో 107 మంది నకిలీ న్యాయవాదుల పేర్లను రిజిస్టర్ జాబితా నుండి తొలగించినట్లు చెప్పారు. 2019 నుంచి 2023 జూన్ 23 వరకు వేల మంది నకిలీ న్యాయవాదులు నమోదైనట్లుగా గుర్తించినట్లు వివరించారు. సమగ్ర విచారణ తర్వాత వారిని తొలగిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు కొందరు వ్యక్తులు నకిలీ సర్టిఫికేట్లతో న్యాయవాదులుగా వ్యవహరిస్తున్నారని శ్రీమంతో సేన్ తెలిపారు. తప్పుడు పత్రాలు, వివరాలతో న్యాయ మండలిలో పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ క్రియాశీల పరిశీలన తర్వాత నకిలీ లాయర్లను గుర్తించి తొలగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వివరించారు.