లక్నో: నకిలీ ఐఏఎస్ అధికారి గుట్టురట్టయ్యింది. (Fake IAS Officer) పలు లగ్జరీ కార్లతో అతడు బిల్డప్ ఇచ్చాడు. కార్లపై నీలి బీకాన్లు అమర్చాడు. నకిలీ పాసులతో సచివాలయంలోకి ప్రవేశించేవాడు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు సీనియర్ అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. గౌతమ్ బుద్ధ నగర్‌కు చెందిన 36 ఏళ్ల సౌరభ్ త్రిపాఠి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ఒక ఎన్జీవో సంస్థను ఏర్పాటు చేశాడు. దీని కోసం చాలా మంది సీనియర్ అధికారులు, నాయకులను కలిశాడు. ఈ సందర్భంగా అధికారుల తీరు, వారి ప్రవర్తనను నిశితంగా గమనించాడు.
కాగా, ప్రభుత్వ యంత్రాంగం, వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో అన్నది సౌరభ్ త్రిపాఠి తెలుసుకున్నాడు. దీంతో నకిలీ ఐఏఎస్ అధికారిగా నటించడం ప్రారంభించాడు. సీనియర్ అధికారిగా బిల్డప్ ఇచ్చేందుకు మూడు ఇన్నోవాలతోపాటు రేంజ్ రోవర్ డిఫెండర్, మెర్సిడెస్ బెంజ్, టయోటా ఫార్చ్యూనర్ వంటి సూపర్ లగ్జరీ కార్లను కాన్వాయ్‌లో వినియోగించాడు. కార్లపై నీలి బీకాన్లు అమర్చాడు. ‘ఉత్తర ప్రదేశ్ విధాన సభ, విధాన పరిషత్, సెక్రటేరియట్, భారత ప్రభుత్వం’ అని ఉన్న స్టిక్కర్లు వినియోగించేవాడు. ‘సౌరభ్_ఐఏఏఎస్’ పేరుతో సోషల్ మీడియా ఖాతాలు నిర్వహించాడు.
మరోవైపు సౌరభ్ త్రిపాఠి ఈ నకిలీ పాసులతో సచివాలయంలోకి ప్రవేశించేవాడు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అలాగే సీనియర్ అధికారులతో సమావేశాలు నిర్వహించేవాడు. వారికి సూచనలతోపాటు ఆదేశాలు కూడా ఇచ్చేవాడు. అయితే అతడు నకిలీ ఐఏఎస్ అధికారి అన్నది ఎవరూ గుర్తించలేదు.
ఇటీవల లక్నోలోని కార్గిల్ షహీద్ పార్క్ సమీపంలో వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సౌరభ్ త్రిపాఠి నకిలీ ఐఏఎస్ ట్యాగ్‌ను పోలీస్ అధికారులకు చూపించాడు. తన వాహనం ఆపడంపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. సౌరభ్ తీరు, ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలిగింది. అతడు వినియోగించిన లగ్జరీ వాహనాలు పలువురి వ్యక్తుల పేర్లతో రిజిస్టరైనట్లు పోలీస్ అధికారులు గుర్తించారు. అతడి వద్ద ఉన్న పత్రాలు, కార్లపై ఉన్న పాసులను పరిశీలించగా అవి నకిలీ అని తేలింది.
కాగా, నకిలీ ఐఏఎస్ అధికారి సౌరభ్ త్రిపాఠిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. దీంతో ఖరీదైన కార్లు, నకిలీ పత్రాలు, పాసులు, నీలి బీకాన్లు, ల్యాప్‌టాప్‌లు. మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ గుర్తింపు పత్రాలతో పలు రాష్ట్రాలు, జిల్లాల్లో ప్రజలను అతడు మోసం చేసినట్లు పోలీసులు అనుమానించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు కోసం అతడి బ్యాంకు ఖాతాలు, లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
MP Judge Gets Rs 5 Billion Threat | బతకాలంటే ఐదు బిలియన్లు ఇవ్వు.. జడ్జీకి బెదిరింపు లేఖ
Indian Wins Rs 35 Crore Jackpot | యూఏఈలో.. రూ.35 కోట్ల లాటరీ గెలుచుకున్న భారతీయుడు
Watch: బెడిసికొట్టిన మంటలు ఊదే స్టంట్.. ఏం జరిగిందంటే?