దామో, ఏప్రిల్ 5: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని దామో నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ మిషనరీ దవాఖానలో ఓ నకిలీ డాక్టర్ చేసిన గుండె ఆపరేషన్లు ఏడుగురిని బలిగొన్నాయి. ఒకే నెలలో ఏడుగురు మరణించడం ఆ ప్రాంతంలో అలజడి రేపింది. ఎన్ జాన్ కెమ్ పేరుతో ఓ బ్రిటిష్ డాక్టర్ ముసుగులో ఓ వ్యక్తి క్రైస్తవ మిషనరీ దవాఖానలో ఉద్యోగంలో చేరాడు. రేడియాలజిస్టునని చెప్పుకున్న ఆ నకిలీ డాక్టర్ రోగులకు గుండె ఆపరేషన్లు చేశాడు. ఆ డాక్టర్ చేతిలో శస్త్ర చికిత్సలు చేయించుకున్న రోగులు కొన్ని గంటల్లోనే మరణించినట్టు అధికారులు చెప్పారు. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులకు ఆ నకిలీ డాక్టర్ అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని తెలిసింది. అధికారిక లెక్కల ప్రకారం మరణాలు ఏడుగా తేలినప్పటికీ లెక్కల్లో చూపనివి చాలానే ఉన్నట్టు జిల్లా శిశు సంక్షేమ కమిటీ అధ్యక్షుడు, న్యాయవాది దీపక్ తివారీ తెలిపారు.
ఆ నకిలీ డాక్టర్‌పై దామో జిల్లా మెజిస్ట్రేట్‌కు ఆయన ఇదివరకే ఫిర్యాదు చేశారు. తమ తండ్రికి గుండె ఆపరేషన్ చేయించేందుకు తాము మిషనరీ దవాఖానకు తీసుకెళ్లామని, అయితే అక్కడి వాతావరణాన్ని చూసి అనుమానంతో జబల్పూర్కు తమ తండ్రిని తీసుకెళ్లామని కొందరు రోగుల పిల్లలు తనకు ఫిర్యాదు చేసినట్టు తివారీ చెప్పారు. అప్పుడే తమకు కూడా నకిలీ డాక్టర్ దవాఖానలో పని చేస్తున్నట్టు తెలిసిందని ఆయన చెప్పారు. అసలు డాక్టర్ బ్రిటన్‌లో ఉండగా నరేంద్ర యాదవ్ నకిలీ డాక్టర్‌గా చెలామణి అవుతున్నాడని ఆయన వెల్లడించారు.
ఆ వ్యక్తిపై హైదరాబాద్‌లో కూడా కేసు నమోదైందని, అతను తన విద్యార్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు చూపించడం లేదని తివారీ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద మిషనరీ దవాఖానకు ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయని మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనూన్గో తెలిపారు. మిషనరీ దవాఖానలో రోగులకు ఓ నకిలీ వైద్యుడు గుండె ఆపరేషన్లు చేసినట్టు తమకు ఫిర్యాదు అందిందని, ఇది చాలా తీవ్రమైన విషయమని ఆయన చెప్పారు.