కోల్కతా: దేశాన్ని కుదిపేసిన వైద్య విద్యార్థిని హత్యాచారంపై నిరసన తెలుపుతున్న పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్ల మధ్య చీలికలు వచ్చాయి. హత్యాచారం, హత్యకు గురైన ఆర్జీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ (31)కు న్యాయం చేయాలనే ప్రధాన డిమాండ్ నుంచి పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ (డబ్ల్యూబీజేడీఎఫ్) పక్కకు తప్పుకుందని కొందరు జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు.
వీరు కొత్తగా పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అనే సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జీ కర్ హాస్పిటల్లో బెదిరింపుల సంస్కృతిలో భాగస్వాములయ్యారనే సాకుతో తమలో చాలా మందిని బహిష్కరించారని వీరు ఆరోపించారు. తమను రెసిడెంట్ డాక్టర్ల సంఘం, డబ్ల్యూజేడీఎఫ్ బెదిరిస్తున్నాయని చెప్పారు.