న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ప్రపంచవ్యాప్తంగా సోమవారం రాత్రి సుమారు 6 గంటలపాటు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలుగడానికి వెనుకున్న కారణాలను మంగళవారం ఫేస్బుక్ వెల్లడించింది. డాటా సెంటర్లలో నెట్వర్క్ ట్రాఫిక్‌ను సమన్వయం చేసే కీలకమైన రూటర్ల కాన్ఫిగరేషన్‌లో మార్పులు చేయడంతో సమస్య తలెత్తినట్టు వివరించింది. దీంతో వెబ్సైట్లు, ఐపీ అడ్రస్‌లను అనుసంధానించే డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్ఎస్)లో కూడా సమస్య ఏర్పడినట్టు తెలిపింది. ఈ కారణం చేతనే సేవల్లో అంతరాయం కలిగిందని, సైబర్ దాడులు జరిగాయన్న వార్తల్లో నిజంలేదని వివరించింది. కాగా ఫేస్బుక్ సేవల్లో అంతరాయం కలుగడంతో ఆ సంస్థ షేర్లు 5 శాతం మేర పడిపోయాయి. దీంతో సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంపద రూ. 52 వేల కోట్లు (7 బిలియన్ డాలర్లు) తరిగిపోయినట్టు సమాచారం.