Growth Rate | న్యూఢిల్లీ: ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో భారత దేశం 6.5 శాతం రేటుతో వృద్ధి సాధించే అవకాశం ఉందని ఈవై ఎకానమీ వాచ్ అంచనా వేసింది. ప్రభుత్వ నిధులను వివేకంతో, బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, మానవ మూలధన అభివృద్ధికి సహకరించే స్పష్టమైన ఆర్థిక వ్యూహాలను అమలు చేస్తే, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు పెరుగుతాయని ఆ సంస్థ తెలిపింది. 2024 ఏప్రిల్- 2025 మార్చి మధ్య కాలంలో భారత దేశ వాస్తవ జీడీపీ వృద్ధి 6.4 శాతమని ఈవై ఎకానమీ వాచ్ మార్చి ఎడిషన్ వెల్లడించింది. తదుపరి సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి చెందుతుందని తెలిపింది. రానున్న రెండు దశాబ్దాల్లో భారత దేశం సాధారణ ప్రభుత్వ విద్య, ఆరోగ్య రంగాల్లో వ్యయాలను క్రమంగా పెంచాల్సి ఉంటుందని చెప్పింది.
అధిక ఆదాయం గల దేశాలు చేసే వ్యయాలకు దగ్గరగా భారత్ కూడా ఖర్చు చేయవలసిన అవసరం ఉంటుందని వివరించింది. విద్యా రంగంలో ప్రస్తుతం ప్రభుత్వ వ్యయం జీడీపీలో 4.6 శాతం ఉందని 2047-48 ఆర్థిక సంవత్సరం నాటికి దీనిని 6.5 శాతానికి పెంచాలని సూచించింది. దేశ జనాభాలో యువత సంఖ్య, పని చేసే సామర్థ్యం గలవారి అవసరం పెరుగుతుండటాన్ని బట్టి ఈ పెరుగుదల అవసరమని తెలిపింది. 2020-21లో ఆరోగ్య రంగంపై జీడీపీలో 1.1 శాతం ఖర్చు చేశారని, 2047-48 ఆర్థిక సంవత్సరం నాటికి దీనిని 3.8 శాతానికి పెంచాలని పేర్కొంది.
ఆరోగ్య సంరక్షణ సేవల మెరుగుదల, సత్ఫలితాల కోసం ఈ ఖర్చు అవసరమని వివరించింది. ఎక్కువ మంది యువత, తక్కువ ఆదాయం గల రాష్ర్టాలకు విద్య, ఆరోగ్య సంరక్షణ అవసరాలకు తగినట్లుగా అదనపు నిధులను అందజేయాలని తెలిపింది. దశలవారీగా ఆర్థిక పునర్నిర్మాణం చేయడం వల్ల ఈ లక్ష్యాలను సాధించవచ్చునని, వృద్ధితో రాజీ పడాల్సిన అవసరం లేదని చెప్పింది.