న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని ఇవాళ జాతీయ యుద్ధ స్మారకం వద్ద కలపనున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రభుత్వం జాతి ద్రోహానికి పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ నేత మనీష్ తివారీ తెలిపారు. చరిత్రను తిరగరాసే ప్రయత్నం జరుగుతోందన్నారు. అమర్ జవాన్ జ్యోతిని, జాతీయ యుద్ధ స్మారకంతో కలపడం అంటే.. చరిత్రను తుడిచిపెట్టడమే అని ఆయన ఆరోపించారు. జాతీయ యుద్ధ స్మారకాన్ని బీజేపీ నిర్మించిందని, అంత మాత్రాన అమర్ జవాన్ జ్యోతిని ఆర్పడం సరికాదు అని తివారీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్లో స్పందించారు. కొందరికి దేశభక్తి, త్యాగాలు అర్థంకావన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమని, అమర జవాన్ల కోసం వెలుగుతున్న జ్యోతిని ఆర్పేస్తున్నట్లు ఆయన ట్వీట్లో తెలిపారు. కొందరికి దేశభక్తి, బలిదానం అర్థం కాదు అని, అయినా పర్వాలేదు అని, మరోసారి మన అమర సైనికుల కోసం జ్యోతిని వెలిగిద్దామని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేత ప్రియాంకా చతుర్వేది తన ట్విట్టర్లో స్పందిస్తూ.. రెండు జ్యోతులను ఎందుకు వెలిగించలేమన్నారు. అమర జ్యోతిని ఆర్పడం ఇది మంచి రాజకీయాలకు సూచకం కాదు అని ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ జా ఆరోపించారు.
बहुत दुख की बात है कि हमारे वीर जवानों के लिए जो अमर ज्योति जलती थी, उसे आज बुझा दिया जाएगा।
— Rahul Gandhi (@RahulGandhi) January 21, 2022
कुछ लोग देशप्रेम व बलिदान नहीं समझ सकते- कोई बात नहीं…
हम अपने सैनिकों के लिए अमर जवान ज्योति एक बार फिर जलाएँगे!
ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని ఇండియన్ ఆర్మీ మాజీ డీజీఎంవో జనరల్ వినోద్ భాటియా స్వాగతించారు. అమర్‌జవాన్ జ్యోతిని.. జాతీయ యుద్ధ స్మారకంతో కలపడం గొప్ప నిర్ణయమన్నారు. అమర్ జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకంతో కలపాల్సిన సమయం ఆసన్నమైందని జనరల్ వినోద్ తెలిపారు.