PM Modi : పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) కి ప్రతీకారంగా జరిగిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindhoor) షాక్ నుంచి పాకిస్థాన్, కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేకపోయాయని ప్రధాని (Prime minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఎద్దేవా చేశారు. ఆ ఆపరేషన్ సమయంలో దాయాది దేశంలో ఉగ్రస్థావరాలపై బాంబులు పడుతుంటే.. ఇక్కడ కాంగ్రెస్ రాజకుటుంబం నిద్రలేని రాత్రులు గడిపిందని విమర్శించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆరాలో నిర్వహించిన ప్రచార సభలో ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ‘జంగల్‌రాజ్’ను బీహార్ ప్రజలు మర్చిపోలేదని, ఆ నేతలు చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిని చవిచూడబోతున్నారని విమర్శించారు. ఆర్జేడీకి అనుకూలంగా సీఎం అభ్యర్థిని ప్రకటించాలని కాంగ్రెస్ అనుకోలేదని, తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించేందుకు హస్తం పార్టీ ఎప్పుడూ సిద్ధంగా లేదని, కాంగ్రెస్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి మరీ ఆర్జేడీ ఆ అవకాశాన్ని దక్కించుకుందని ఆరోపించారు.
ఎన్నికల అనంతరం ఆ పార్టీల నేతలు పరస్పరం పోట్లాడుకుంటారని మోదీ చెప్పారు. మహా కుంభమేళాను ఇరుపార్టీల నేతలు అవమానించారని, ఓ కాంగ్రెస్ నేత ఛఠ్ పూజను అపహాస్యం చేశారని, ఇకపై ఎవరూ అలా చేసేందుకు ధైర్యం చేయలేనంతగా గుణపాఠం నేర్పాలి ఓటర్లను కోరారు. జాతీయ భద్రతకు, సైన్యానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ను అమలు చేస్తున్నామని, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేశామని చెప్పారు.
ఉగ్రవాదులను వారి గడ్డపైనే శిక్షించాలని ప్రతిజ్ఞ చేశామని, ఆపరేషన్ సిందూర్ రూపంలో దాన్ని నెరవేర్చామని ప్రధాని అన్నారు. పొరుగు దేశంలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ రాజకుటుంబానికి నిద్ర కరవైందని విమర్శించారు. ఇందిరాగాంధీ హత్య అనంతరం చెలరేగిన హింసను ప్రస్తావిస్తూ.. 1984లో దాదాపు ఇదే సమయంలో ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోశారని, ఆ మారణహోమం విషయంలో కాంగ్రెస్ ఇంకా క్షమాపణ చెప్పలేదని, దోషులను ప్రోత్సహిస్తోందని అన్నారు.