ముంబై, జనవరి 24(నమస్తే తెలంగాణ) : మహారాష్ట్రలో శుక్రవారం ఘోర దుర్ఘటన సంభవించింది. భండారా జిల్లాలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 8 మంది మరణించినట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం శుక్రవారం ఉదయం జరిగిన ఈ పేలుడులో 8 మంది వ్యక్తులు మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారని ఆయన తెలిపారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశామని, గాయపడిన ఐదుగురు వ్యక్తులను రక్షించామని జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్టే వెల్లడించారు. శిథిలాల కింద ఉన్న నలుగురు లేదా ఐదుగురు వ్యక్తుల కోసం సహాయక చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. జవహర్ నగర్ వద్ద ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించినట్టు అధికారులు తెలిపారు. పేలుడు కారణంగా మంటలు చెలరేగి భవనం కూలిపోయిందని అధికారులు తెలిపారు.