న్యూఢిల్లీ: కుంగుబాటు(డిప్రెషన్)కు మానసిక చికిత్స అందించే ఫలితాలతో సమానంగా వ్యాయామం కూడా అందిస్తుందని కాక్రేన్ కొలాబరేషన్ తాజా సమీక్ష వెల్లడించింది. 5 వేల మందిని అధ్యయనం చేసి ఈ వివరాలను తెలిపారు. వీరికి డిప్రెషన్ తగ్గించే ఔషధాలను కూడా ఇచ్చి పరీక్షించారు. ‘కుంగుబాటు లక్షణాలను తగ్గించడంలో వ్యాయామం కీలక పాత్ర పోషించింది’ అని యూకేలోని లాంక్షైర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్రూ క్లెగ్ తెలిపారు. అయితే దీనిపై మరింత నాణ్యమైన అధ్యయనం చేయాల్సి ఉందని ఆయన అన్నారు. సెరోటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్ల లాంటి న్యూరో ట్రాన్స్మిటర్ల పనితీరును మెరుగుపరచడంలో వ్యాయామం సహాయపడుతుందని డాక్టర్ స్టీఫెన్ చెప్పారు. మన మానసిక స్థితిని మెరుగుపరిచే రసాయనాలు విడుదలవడంలోనూ వ్యాయాయం సహాయం చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.