న్యూఢిల్లీ, జూన్ 16: దాదాపు 80 ఏండ్ల తర్వాత కర్ణాటకలోని ‘కోలార్ గోల్డ్ ఫీల్డ్స్’ (కేజీఎఫ్)లో బంగారం తవ్వకాలు చేపట్టేందుకు మళ్లీ రంగం సిద్ధమవుతున్నది. అత్యంత అధునాతన మైనింగ్ పద్ధతుల్లో కేజీఎఫ్‌ను పునరుజ్జీవింప చేసేవిధంగా అడుగులు పడుతున్నాయి. భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (బీజీఎంఎల్) యాజమాన్యంలోని 1,003 ఎకరాల్లో విస్తరించిన 13 టెయిలింగ్ డంప్‌లలో ఉపరితల తవ్వకాలు చేపట్టాలన్న కేంద్రం ప్రతిపాదనకు కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ డంప్‌లలో గతంలో జరిపిన తవ్వకాల నుండి తీసిన 3.2 కోట్ల టన్నుల ముడి ఖనిజం ఉండగా, ఇందులో 2.3 కోట్ల టన్నుల్లో బంగారం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. దీని నుండి ఏటా 750 కిలోగ్రాముల బంగారం ఉత్పత్తి చేయవచ్చునని సమాచారం. పర్యావరణ, నిర్వహణ అనుమతులు వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో బంగారం ఉత్పత్తి మొదలవుతుందని వార్తలు వెలువడ్డాయి.