అమేథీ: ఉత్తరప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) పేరును అమేథీ ఓటరు లిస్టులో సిర్ ప్రకారం చేర్పించారు. అమేథీ నియోజకవర్గం నుంచి ఆమె గతంలో ఎంపీగా చేశారు. గౌరీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న మేదాన్ మవాయి గ్రామంలో స్మృతి ఇరానీ పేరును ఓటరు లిస్టులో నమోదు చేశారు. ఆ గ్రామంలో మాజీ మంత్రి ఇరానీ కొత్తగా ఇంటిని కట్టుకున్నారు.
2024 లోక్సభ ఎన్నికల సమయంలోనూ మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఇదే గ్రామం నుంచి తన ఓటును రిజిస్టర్ చేసుకున్నారని బీజేపీ అమేథీ జిల్లా అధ్యక్షుడు సుధాన్షు శుక్లా తెలిపారు. ఆ గ్రామం నుంచే ఆమె ఓటు వేసినట్లు తెలిపారు. 2014 నుంచి అమేథీ రాజకీయాల్లో స్మృతి యాక్టివ్గా ఉన్నారు. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతున్నారు. 2014లో రాహుల్ గాంధీపై ఓడిపోయారు. అయితే 2019లో రాహుల్ గాంధీని ఆమె ఓడించారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు.
అమేథీతో రిలేషన్ విడదీయలేమని, ఇక్కడ నుంచే ఆమె ఓటు వేస్తారని శుక్లా తెలిపారు. మేదాన్ మవాయి కంపోజిట్ స్కూల్ లీలా టిక్రా మవాయి పోలింగ్ స్టేషన్లో 514 సీరియల్ నెంబర్లో స్మృతి ఇరానీ పేరు ఉన్నది. ఆ పోలింగ్ స్టేషన్లో మొత్తం 666 రిజిస్టర్ ఓటర్లు ఉన్నారు. మేదాన్ మవాయి గ్రామంలో 2021 ఫిబ్రవరిలో ఆమె 1100 గజాల స్థలం కొన్నారు. అక్కడ ఇళ్లు నిర్మించి 2024లో గృహప్రవేశం చేశారు.