న్యూఢిల్లీ : జీవితంలో అత్యధిక సమయం పని చేయడానికే వెచ్చించాలనేవారి జాబితాలోకి నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ కూడా చేరారు. ‘బిజినెస్ స్టాండర్డ్’ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కష్టపడి పని చేయకపోవడం గురించి మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. “కష్టపడి పని చేయడాన్నే నేను గట్టిగా నమ్ముతాను. వారానికి 80 గంటలైనా, 90 గంటలైనా భారతీయులు కష్టపడి పని చేయాలి.
4 ట్రిలియన్ డాలర్ల నుంచి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ఎదగాలనేది మీ బలమైన ఆకాంక్ష అయితే, మీరు వినోదం ద్వారానో, సినీ తారల అభిప్రాయాలను అనుసరిస్తూనో దానిని సాధించ లేరు” అని చెప్పారు. గడువు కన్నా ముందే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తప్పనిసరిగా శ్రమించి పని చేయాలన్నారు. అదే సమయంలో నాణ్యతలో రాజీ పడకూడదని, ఖర్చులు మితిమీరకూడదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన కొరియా, జపాన్లను ప్రస్తావించారు. ఈ రెండు దేశాలు పని పట్ల బలమైన నిబద్ధతను ప్రదర్శించినందువల్ల ఆర్థికంగా విజయం సాధించాయని తెలిపారు. భారత దేశం కూడా అటువంటి ఆలోచనా ధోరణిని అలవరచుకోవాలని చెప్పారు. ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇది తప్పనిసరి అని తెలిపారు.