కోల్‌కతా: నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి ముకుల్ రాయ్ కుమారుడైన సుభ్రాన్షు రాయ్ అదృశ్యమయ్యారు. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే కూడా అయిన ఆయన టూర్ కోసం నేపాల్ వెళ్లారు. అయితే ఆగస్ట్ 25 నుంచి ఎలాంటి సంప్రదింపులు లేకపోవడంతో ఆయన భార్య ఆందోళన వ్యక్తం చేశారు. (Mukul Roy’s Son Missing In Nepal) ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఏర్పాటు చేసిన పర్యటనలో భాగంగా సుభ్రాన్షు రాయ్ ఆగస్ట్ 21న నేపాల్‌కు వెళ్లినట్లు ఉత్తర 24 పరగణాల జిల్లాలో నివసిస్తున్న ఆయన భార్య శర్మిష్ట భౌమిక్ రాయ్ తెలిపారు. అయితే నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో ఆయన అదృశ్యమై ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్ట్ 25 రాత్రి నుంచి తన భర్తతో ఎటువంటి సంప్రదింపులు జరుపలేకపోయినట్లు ఆమె చెప్పారు.
కాగా, కోల్‌కతా నుంచి మౌంట్ కైలాష్, మానస సరోవరం వెళ్తున్న 32 మంది సభ్యుల బృందం కూడా నేపాల్ వరదల్లో గల్లంతయ్యారు. ఈ బృందంలో 30 మంది పర్యాటకులు, ఇద్దరు టూర్ మేనేజర్లు ఉన్నారు. ఆగస్ట్ 21న ఈ బృందం కోల్‌కతా నుంచి బయలుదేరింది. మరుసటి రోజు నేపాల్ చేరుకున్నారు. బుధవారం ఉదయం నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలోని రసువాగధికి ఈ బృందం చేరుకున్నది. ఉదయం 8:30 గంటల సమయంలో ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద వారు ఉన్నారు. ఆ తర్వాత సంభవించిన ఆకస్మిక వరదల్లో ఈ 32 మంది కూడా గల్లంతయ్యారు.
మరోవైపు నేపాల్ వరదల్లో ఇప్పటి వరకు సుమారు 300 మందికిపైగా మరణించారు. 288 మంది భారతీయులతో సహా 750 మందికి పైగా గల్లంతయ్యారు. జల ప్రళయానికి నేపాల్‌లో పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. వంతెనలు కూలిపోవడంతో పాటు జలవిద్యుత్ కేంద్రాలతో సహా అనేక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.