CJI Surya Kant : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌పై వివిధ లా యూనివర్సిటీ విద్యార్థుల్లో వ్యతిరేకత కొనసాగుతోంది. తాజాగా బెంగళూరుకు చెందిన ఎన్ఎల్ఎస్ఐయూ (ద నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ) గ్రాడ్యుయేట్ విద్యార్థులు కూడా సీజేఐపై వ్యతిరేకంగా ఉన్నారు. అయితే, అది తమ స్నాతకోత్సవానికి జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపైనే.
ఇటీవల హైదరాబాద్ నల్సార్ లా విద్యార్థులు కూడా తమ గ్రాడ్యుయేషన్ స్నాతకోత్సవానికి సీజేఐని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో బెంగళూరు లా యూనివర్సిటీ విద్యార్థులు కూడా తమ స్నాతకోత్సవానికి సీజేఐని ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు కూడా ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12న బెంగళూరులో ఎన్ఎల్ఎస్ఐయూ లా గ్రాడ్యుయేషన్ విద్యార్థుల స్నాతకోత్సవం జరగాల్సి ఉంది.
దీనికి సీజేఐ సూర్యకాంత్‌ను చీఫ్ గెస్టుగా ఆహ్వానిస్తూ యూనివర్సిటీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆగష్టు 3న విద్యార్థులకు మెయిల్ ద్వారా సమాచారం అందించింది. అయితే, ఆయన రాకను విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఆయన వస్తే తాము కార్యక్రమానికి హాజరు కాబోమని తేల్చి చెప్పారు. దీంతో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఎన్ఎల్ఎస్ఐయూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగష్టు 27న విద్యార్థులకు సమాచారం అందించింది. అనుకోని అవాంతరాల వల్ల ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
విద్యార్థులు తమ సర్టిఫికెట్లను కొరియర్ ద్వారా తీసుకోవాలని లేదా క్యాంపస్‌లో సంప్రదించి నేరుగా తీసుకోవచ్చని సూచించింది. ఈ విషయంలో విద్యార్థులు ఏది ఎంచుకుంటారో సూచించేలా ఒక ఫాంను విడుదల చేస్తామని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది. అయితే, ఈ నిర్ణయంపై పూర్వ విద్యార్థులు, ప్రొఫెసర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు సీజేఐ రాకను వ్యతిరేకించినంత మాత్రాన కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయడం తగదని అంటున్నారు.
మరొకరిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి, కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని సూచిస్తున్నారు. అలా కాకుండా, పూర్తిగా రద్దు చేయడం అంటే విద్యార్థులపై ప్రతీకార్య చర్యగానే భావించాల్సి వస్తుందన్నారు.