Maharashtra | ముంబై, జూలై 25: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌పై రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సంచలన ఆరోపణలు చేశారు. మూడేండ్ల క్రితం రాష్ట్రంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆయన కుట్రలు చేశారని ఆరోపించారు. అందులో భాగంగా అప్పటి సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఇతర ఎంవీకే కూటమి నేతలకు వ్యతిరేకంగా తప్పుడు అఫిడవిట్లు ఫైల్ చేయాలని తనపై ఒత్తిడి చేశారని, ఈ మేరకు ఫడ్నవీస్ తనతో పలుమార్లు ఫోన్లో మాట్లాడారని, ఆయన మనిషి ద్వారా రాయబారం నడిపారని పేర్కొన్నారు.
అలా చేస్తే ‘రిటర్న్ గిఫ్ట్’గా తనపై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తులను నిలిపివేయిస్తామని ఫడ్నవీస్ ఆఫర్ ఇచ్చారని దేశ్‌ముఖ్ అన్నారు. తాను తిరస్కరించినందుకు తనపైకి సీబీఐ, ఈడీలను పంపించారని, 13 నెలల పాటు జైల్లో పెట్టారని ఎన్సీపీ(శరద్ పవార్) నేత అనిల్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. దేశ్‌ముఖ్ ఆరోపణలు నిరాధారమైనవని ఫడ్నవీస్ అన్నారు. ఉద్ధవ్, శరద్ పవార్లకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యల ఆడియో, వీడియో క్లిప్పులు తన వద్ద ఉన్నాయని అన్నారు. ఫడ్నవీస్‌కు కౌంటర్ ఇస్తూ.. తనకు వ్యతిరేకంగా వీడియో క్లిప్పులను బయటపెట్టాలని అనిల్ సవాల్ చేశారు.