Rahul Ganhdi : ఇవాళ విపక్ష ఎంపీల (Opposition MPs) సమావేశం తర్వాత ఢిల్లీ (Delhi) లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. మరోసారి ఈసీ కార్యాలయానికి వెళ్లడానికి ప్రతిపక్ష ఎంపీలు సిద్ధమయ్యారు. దాంతో ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం (Union Govt) పై తీవ్రంగా మండిపడ్డారు.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడితే తనపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎఫ్ఐఆర్లను పతకాలుగానే భావిస్తానని చెప్పారు. ఇప్పటివరకు తనపై 45 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, వంద తన టార్గెట్ అని తెలిపారు.
లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలం కలిసి ఈసీని కలవాలనుకున్నామని చెప్పారు. అందుకే మంగళవారం ఈసీని కలుద్దామని 300 మంది ఎంపీలం వెళ్లామని, కానీ తమకు అనుమతి నిరాకరించారని తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. తమ దృష్టిలో ఆయన చట్టబద్ధమైన అధికారి కాదని చెప్పారు. అందుకే పదవి నుంచి దిగిపోవాలని కోరుతున్నామని అన్నారు. దేశ ద్రోహులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపడుతామని రాహుల్ గాంధీ తెలిపారు. కాగా సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సహా విపక్ష ఎంపీలు జంతర్‌మంతర్ వద్దకు బస్సుల్లో బయల్దేరారు. వారిని అడ్డుకోవడానికి జంతర్‌మంతర్ వద్ద వందల సంఖ్యలో పోలీసులు, భద్రతా బలగాలు మోహరించారు.