న్యూఢిల్లీ, మే 6: ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ స్కోరును తిరిగి పరిగణనలోకి తీసుకోనున్నారు. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ఈ విషయం వెల్లడించింది. ఆంగ్ల భాషా సామర్థ్యాన్ని తెలిపే ‘టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వెజ్’ (టోఫెల్)ను ప్రిన్స్టన్కు చెందిన ఏజెన్సీ ఈటీఎస్ నిర్వహిస్తున్నది. 2024 మే 5 తర్వాత టోఫెల్ పరీక్షల స్కోర్ ఆస్ట్రేలియాలో అన్ని రకాల వీసాలకు లెక్కలొకి వస్తుందని ఈటీఎస్ తెలిపింది. టోఫెల్ స్కోర్‌పై గత ఏడాది జూలైలో ఆస్ట్రేలియా సమీక్ష చేపట్టింది. వీసా జారీలో ఈ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపింది. దీంతో 60 ఏండ్లుగా కొనసాగుతున్న టోఫెల్ టెస్ట్‌లో ఈటీఎస్ కొన్ని మార్పులు చేపట్టింది. ‘టోఫెల్ ఐబీటీ’ అనేది తీసుకురాగా, దీనిపై సమీక్ష జరిపిన ఆస్ట్రేలియా హోం శాఖ (డీహెచ్ఏ) సంతృప్తి వ్యక్తం చేసింది. ‘మరింత మెరుగుపర్చిన టోఫెల్ పరీక్ష.. వీసా దరఖాస్తుదారుల ఆంగ్ల భాష సామర్థ్యానికి కొలమానంగా డీహెచ్ఏ భావిస్తున్నది’ అని ఈటీఎస్ ఇండియా, దక్షిణాసియా కంట్రీ మేనేజర్ సచిన్ జైన్ చెప్పారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్.. ప్రపంచంలోని అనేక దేశాల్లో 12,500కిపైగా విద్యా సంస్థలు టోఫెల్ స్కో ర్ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి హత్య
నవ్‌జీత్ సంధూ (22) అనే ఎంటెక్ విద్యార్థి ఆస్ట్రేలియాలో మరో భారతీయ విద్యార్థి చేతిలో హత్యకు గురయ్యాడు. ఇంటి అద్దె విషయమై కొందరు భారత విద్యార్థుల మధ్య జరుగుతున్న గొడవను పరిష్కరించేందుకు నవ్‌జీత్ ప్రయత్నించినప్పుడు ఈ దారుణం చోటు చేసుకొంది. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన మృతుడి మామ యశ్వీర్ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. ‘నవ్‌జీత్‌ను అతడి స్నేహితుడొకరు కొన్ని సామాన్లు తెచ్చేందుకు కారు కావాలని అడిగారు. అతడి ఇంటికి నవ్‌జీత్ తన కారు తీసుకెళ్లాడు. అక్కడ కొందరు భారత విద్యార్థులు అద్దె విషయమై గొడవ పడుతున్నారు. గొడవ పడకండని నవ్‌జీత్ వారికి సర్ది చెప్పే ప్రయ్నతం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన ఒక విద్యార్థి కత్తితో నవ్‌జీత్‌ను పొడిచి చంపాడు’ అని యశ్వీర్ తెలిపారు. నిందితుడు కూడా కర్నాల్ ప్రాంతానికి చెందినవాడేనని చెప్పారు. నవ్‌జీత్ తెలివైన విద్యార్థి అని.. జూలైలో సెలవుల సమయంలో అతడు స్వదేశానికి రావాల్సి ఉందని యశ్వీర్ వాపోయారు. నిందితులైన ఇద్దరు భారత విద్యార్థులు అభిజిత్, రాబిన్ గార్టన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
స్టూడెంట్ వీసా నిబంధనలు కఠినతరం
స్టూడెంట్ వీసా నిబంధనల్ని ఆస్ట్రేలియా కఠినతరం చేస్తున్నది. 2025 నాటికి వలసల్ని సగానికి తగ్గించే ప్రయత్నంలో భాగంగా, భారత్ వంటి దేశాలకు చెందిన విద్యార్థుల వీసాలను ఆలస్యం చేయటం, తిరస్కరించటం వంటి చర్యలను ఆస్ట్రేలియా చేపడుతున్నది. దీంతో ఆ దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు భారతీయ విద్యార్థులను చేర్చుకోవటం లేదు. ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా ప్రభుత్వం విద్యార్థుల వీసా నిబంధనల్ని కఠినతరం చేసింది. ఐఈఎల్టీఎస్ అర్హత స్కోర్ పెంచటం, ఆర్థికపరంగా అర్హత ప్రమాణాల్ని పెంచటం వంటివి ప్రస్తుత ప్రభుత్వం చేపట్టింది. దీంతో 2022 డిసెంబర్-2023 డిసెంబర్ మధ్యకాలంలో ఆస్ట్రేలియా వీసా దక్కిన భారతీయ విద్యార్థుల సంఖ్య 48శాతం తగ్గినట్టు ఓ నివేదిక పేర్కొన్నది. వీసా తిరస్కరణపై కాన్‌బెర్రాలోని భారత హై కమిషన్ కార్యాలయం స్పందించింది. ఆస్ట్రేలియాకు వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో రెండో అతిపెద్ద దేశం భారత్ కావటమే దీనికి కారణమని అభిప్రాయపడింది. 2023 జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో ఆస్ట్రేలియాలో 1.22 లక్షల మంది భారతీయ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.