న్యూఢిల్లీ, మే 29: వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ భాషా పరీక్ష(టోఫెల్)లో మార్పులు జరగనున్నాయి. విద్యార్థి సామర్థ్యాన్ని రియల్‌టైమ్ ఆధారంగా గుర్తించేందుకు వ్యక్తిగతంగా పరీక్షను నిర్వహించడంతోపాటు కృత్రిమ మేధ(ఏఐ) సహాయంతో ఐడెంటిటీ వెరిఫికేషన్ వంటి మార్పులు తీసుకురానున్నట్లు ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఈటీఎస్) వెల్లడించింది. టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలను నిర్వహించే ప్రిన్స్టన్కి చెందిన ఈటీఎస్ కొన్ని మార్పులు, ఆధునీకరణను గురువారం ప్రకటించింది.
వీటిలో కొన్ని ఈ నెల 30 నుంచి అమలులోకి రానుండగా మిగిలివని 2026 నుంచి అమలు అవుతాయి. 2026 నుంచి టోఫెల్ ఐబీటీకి సంబంధించి చదవడం, వినడం విభాగాలలో బహుళ-దశల విధానాన్ని అమలులోకి తీసుకురానున్నది. విద్యార్థి ప్రతిభను అంచ నా వేసేందుకు రియల్ టైమ్ ఆధారిత మార్పులు చేయనున్నది.
గ్రూపు డిస్కషన్స్, ప్రాజెక్టు వర్క్ వంటి వాస్తవ విద్యాసంబంధ అంశాలలో విద్యార్థుల ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు వీలుగా పరీక్షను నిర్వహించనున్నట్లు ఈటీఎస్ పేర్కొంది. ఇంగ్లిష్ భాషను మాట్లాడే యూనివర్సిటీలలో చేరాలనుకుంటున్న స్థానికేతర విద్యార్థులకు ఇంగ్లిష్ భాష ప్రావీణ్యాన్ని అంచనా వేసేందుకు టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్(టోఫెల్) ఓ ప్రామాణికమైన పరీక్ష. 160కి దేశాలలోని 12,000కిపైగా సంస్థలు ఈ పరీక్షను గుర్తిస్తాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలతోపాటు బ్రిటన్‌లోని 98 శాతం యూనివర్సిటీలు ఈ పరీక్షను ఆమోదిస్తాయి.