టెహ్రాన్: చమురు నౌకల రవాణాకు కీలకమైన హొర్ముజ్ జల సంధిని నిర్వహించడానికి ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఇరాన్ అత్యున్నత భద్రతా మండలి సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ జల సంధిలో జరిగే ఆపరేషన్లపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని తెలిపింది. హొర్ముజ్ నిర్వహణకు ఒక సమర్థవంతమైన విధానాన్ని రూపొందించామని ఇరాన్ పార్లమెంట్ జాతీయ సెక్యూరిటీ మిషన్ అధిపతి ఇబ్రహీం అజీజ్ ప్రకటించిన తర్వాత ఇరాన్ ఈ ప్రకటన చేసింది. అయితే ఈ కొత్త సంస్థ విధులను ఇరాన్ స్పష్టంగా ప్రకటించలేదు. అయితే హొర్ముజ్పై సార్వభౌమాధికారం ఈ కొత్త సంస్థకు ఉంటుందని.. ఆ జల సంధి గుండా వెళ్లే నౌకలకు ఈ-మెయిల్ ద్వారా నిబంధనలను పంపడం చేస్తుందని ఇరాన్ మీడియా తెలిపింది.
రష్యా చమురు కొనుగోలు కొనసాగింపు ; అమెరికా మినహాయింపులతో సంబంధం లేదన్న కేంద్రం
న్యూఢిల్లీ: అమెరికా ఆంక్షల మినహాయింపులకు ముందు, ఆ సమయంలో, ఆ తర్వాత కూడా రష్యా చమురు కొనుగోలు చేయడం కొనసాగించామని ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. కొన్ని రష్యన్ ముడి చమురు కొనుగోళ్లకు సంబంధించి ఇచ్చిన మినహాయింపు గడువును ఈ వారాంతంలో అమెరికా ముగించనున్న నేపథ్యంలో పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రష్యా నుంచి భారతదేశం చేసే ముడిచమురు కొనుగోళ్లు అమెరికా మినహాయింపుల చట్రంపై ఆధారపడి లేవు. అవి వాణిజ్యపరమైన లాభాపేక్షతో జరగుతున్నాయని తెలిపారు. ‘తగినంత ముడి చమురును పదేపదే ఒప్పందాల ద్వారా సిద్ధం చేసుకున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.