Erdogan comments : జమ్మూకశ్మీర్‌పై తుర్కియే అధ్యక్షుడు (Turkey President) రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ (Erdogan) చేసిన వ్యాఖ్యలు భారత్‌కు ఆగ్రహం తెప్పించాయి. ఆయన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఎర్డోగాన్ వ్యాఖ్యలు అనుచితమని, ఏమాత్రం ఆమోదయోగ్యం కావని భారత విదేశాంగ శాఖ (MEA) ప్రతినిధి రణ్‌దీప్ జైశ్వాల్ (Randeep Jaiswal) అన్నారు.
జైశ్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎర్డోగాన్ వ్యాఖ్యలపై తుర్కియే అంబాసిడర్ దగ్గర భారత్ అభ్యంతరం తెలిపిందని చెప్పారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి సంబంధించి ఎర్డోగాన్ వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, భారత్‌కు వ్యతిరేకంగా చొరబాట్లు, సరిహద్దు ఉగ్రవాదాన్ని పాక్ ప్రేరేపిస్తోందని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద విధానమే జమ్మూకశ్మీర్‌కు అసలైన ముప్పని అన్నారు.
పాకిస్థాన్‌లో రెండు పర్యటించిన ఎర్డోగోన్ కశ్మీర్ అంశంపై మాట్లాడారు. కశ్మీర్ సమస్యను ఇండియా, పాకిస్థాన్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుగుణంగా ఉభయదేశాలు చర్చించుకోవాలని చెప్పారు. కశ్మీర్ సోదరులకు తాము సంఘీభావం తెలుపుతున్నట్టు ఆయన ప్రకటించారు.
కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లఢఖ్‌లు భారతదేశంలో అంతర్భాగమని భారత్ పదేపదే స్పష్టంచేస్తోది. కేంద్రం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను 2019 ఆగస్టు 5న రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. తిరిగి రాష్ట్ర హోదా కల్పించే దిశగా ఇటీవల జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు సైతం నిర్వహించింది. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది.