 
                                                            EPS Pension | ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త.. వెయ్యి నుంచి రూ.2500కు కనీస పెన్షన్ పెంపు!న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త. ప్రస్తుతం 1,000 రూపాయలుగా ఉన్న కనీస పెన్షన్ త్వరలో 2,500 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 10-11 తేదీల్లో బెంగళూరులో జరిగే ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. పెన్షన్ పెంపు ప్రతిపాదనకు ఈ సమావేశంలో ఆమోదం పొందితే 11 ఏండ్ల తర్వాత అతి పెద్ద పెన్షన్ పెంపు అవుతుంది. రూ.1,000 కనీస పెన్షన్ విధానాన్ని 2014లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ విధానంలో పెన్షనర్లకు ఒక్క రూపాయి కూడా పెంచలేదు. దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది ఈ కనీస పెన్షన్‌నే అందుకుంటున్నారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) 1995లో ప్రవేశపెట్టిన ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) వ్యవస్థీకృత రంగంలో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ అందిస్తుంది. ఆయా వ్యవస్థీకృత రంగంలో వరుసగా కనీసం 10 ఏండ్లు సర్వీస్ పూర్తి చేసి, 58 ఏండ్లు పూర్తయిన తర్వాత ఉద్యోగులు ఈ పెన్షన్ స్కీమ్‌కు అర్హులు. ఒక వేళ ఉద్యోగి మధ్యలో ఉద్యోగం మానేసినట్టయితే వారు తమ నుంచి సేకరించిన పెన్షన్‌ను ఉపసంహరించుకోవచ్చు. లేదా తగ్గించిన పెన్షన్ మొత్తాన్ని ఎంచుకోవచ్చు.
 
                            