Digilocker | ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకపై మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవడానికి, పాస్‌బుక్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లో ఉండే డిజిలాకర్ యాప్ ద్వారానే వీటిని సులువుగా తెలుసుకోవచ్చు. ఈ మేరకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ సరికొత్త ఈపీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇకపై ఈపీఎఫ్ ఖాతాదారులు ఎక్కడి నుంచైనా సరే డిజిలాకర్ ద్వారా తమ పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్, ఇతర డాక్యుమెంట్లను యాక్సెస్ చేయవచ్చని ఈపీఎఫ్‌వో ట్విట్టర్(ఎక్స్) వేదికగా తెలియజేసింది. అలాగే యూఏఎన్ కార్డు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీవో), స్కీమ్ సర్టిఫికెట్ వంటి సేవలను కూడా డిజిలాకర్ ద్వారా పొందవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిందని చెప్పింది. ఐవోఎస్ యూజర్లకు త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. కాగా, ఈపీఎఫ్ సేవలు ఇప్పటికే ఉమాంగ్ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.