ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అంతా మహారాష్ట్ర ప్రభుత్వంతోనే ఉందని అజిత్ పవార్ (Ajit Pawar) తెలిపారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. మెజార్టీ ఎన్సీపీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ మొత్తం బీజేపీ, శివసేన ప్రభుత్వంతో ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందుకే ఎన్సీపీ అంతా ప్రభుత్వంలో చేరిందని అన్నారు. ఎన్సీపీలో ఎలాంటి చీలిక లేదని తెలిపారు. కొంత మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉన్నారని, మరికొంత మంది ముంబైకి చేరలేకపోయారని చెప్పారు. వారంతా తనకు మద్దుతు ఇచ్చినట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గుర్తుతోనే తామంతా పోటీ చేస్తామని చెప్పారు.
కాగా, చాలా మంది మమ్మల్ని విమర్శించేందుకు ప్రయత్నిస్తారని అజిత్ పవార్ అన్నారు. అయితే వాటికి తాము స్పందించబోమని తెలిపారు. మూడున్నరేళ్ల కిందట ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలో ఎంవీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతిని గుర్తు చేశారు. శివసేనతో కలిసి వెళ్లిన తాము బీజేపీతో కలిసి వెళ్లలేమా? అని ప్రశ్నించారు. నాగాలాండ్‌లో బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అదే మాదిరిగా మహారాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం బీజేపీతో కలిసినట్లు చెప్పారు. ప్రభుత్వంలో చేరిన తన చర్యను సమర్థించుకునేందుకు ఆయన ప్రయత్నించారు. క్యాబినెట్ ప్రొఫైల్స్ ఖరారు కాగానే మహారాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తామని అన్నారు.
మరోవైపు, మహారాష్ట్ర ప్రజల అభీష్టం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలోని తన సహచరుల మద్దతు, వారి విశ్వాస బలంతో ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినట్లు అజిత్ పవార్ ట్వీట్ చేశారు. ప్రజల సంక్షేమం కోసం, మహారాష్ట్ర అభివృద్ధి కోసం తన పదవిని వినియోగిస్తానని అందులో పేర్కొన్నారు.
महाराष्ट्रातील जनतेची इच्छा, राष्ट्रवादी काँग्रेस पक्षातील सहकाऱ्यांचा पाठिंबा, विश्वासाच्या बळावर आज राज्याचा उपमुख्यमंत्री म्हणून पद व गोपनीयतेची शपथ घेतली. माझ्या या पदाचा उपयोग जनतेच्या कल्याणासाठी, महाराष्ट्राच्या विकासासाठी होईल असा विश्वास देतो. pic.twitter.com/mvZ2oh7w6u
— Ajit Pawar (@AjitPawarSpeaks) July 2, 2023