న్యూఢిల్లీ: ఫ్యాషన్ డిజైన్ కంపెనీ మిన్త్రపై ఈడీ(Enforcement Directorate) కేసు నమోదు చేసింది. ఫెమా ఉల్లంఘన జరిగినట్లు ఆ కేసులో ఈడీ పేర్కొన్నది. సుమారు 1654.35 కోట్ల మేరకు అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. మిన్త్ర డిజైన్స్ కంపెనీతో పాటు దాని అనుబంధ సంస్థలు, డైరెక్టర్లు ఈ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈడీ ప్రకారం… మిన్త్ర తో పాటు అనుబంధ కంపెనీలు.. మల్టీ బ్రాండ్ రిటేల్ వాణిజ్యాన్ని కొనసాగించాయి. కానీ హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం చేస్తున్నట్లు ఆ కంపెనీ పేర్కొన్నది. తప్పుడు వ్యాపారాన్ని సూచిస్తున్న ఆ కంపెనీ.. నేరుగా ఎఫ్‌డీఐ విధానాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని ఈడీ తెలిపింది.
ఎంబీఆర్‌టీ వ్యాపారంలో విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉండదు. మిన్త్ర కంపెనీ వెక్టర్ ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో దుస్తులను విక్రయించింది. వెక్టర్ గ్రూపు నేరుగా కస్టమర్లకు సరుకులను అమ్మినట్లు ఈడీ పేర్కొన్నది. రిటేల్‌గా సాగిన వ్యాపారాన్ని పేపర్‌పై మాత్రం హోల్‌సేల్‌గా చూపించినట్లు వెక్టర్ గ్రూపుపై ఈడీ ఆరోపణలు చేసింది. ఇదొక రకంగా ఎఫ్‌డీఐ రూల్స్ ఉల్లంఘన అవుతుందని ఈడీ తెలిపింది.