(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): పర్యావరణాన్ని పరిరక్షించి, జీవ వైవిధ్యాన్ని కాపాడి, మనిషికి ఆవాసంగా, ఆహారంగా, ఆయువుగా మారిన ‘చెట్టు తల్లి’ ప్రమాదం అంచుకు చేరింది. ప్రపంచంలోని 38 శాతం వృక్షజాతులు అంతరించిపోయే స్థితికి చేరుకొన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) ఆందోళన వ్యక్తం చేసింది. కాప్-16 సదస్సులో బొటానిక్ గార్డెన్స్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ (బీజీసీఐ)తో కలిసి ఈ మేరకు నివేదికను వెలువరించింది. నివేదిక రూపకల్పనలో వెయ్యి మంది శాస్త్రవేత్తలు పాలుపంచుకొన్నారు.
అంతరించిపోవడానికి కారణాలు
వ్యవసాయం కోసం అడవుల్లోని చెట్లను తొలగించడం, వంటచెరుకుతో పాటు ఇంటి నిర్మాణం కోసం చెట్లను నరికేయడం, వ్యాధులు, తెగుళ్లు, కార్చిచ్చులు వంటి అంశాలు వృక్ష జాతులు అంతరించిపోవడానికి ప్రధాన కారణంగా నివేదిక అభిప్రాయపడింది.
అంతరిస్తే అంతమే
వృక్షజాతులు అంతరించిపోతే జీవ వైవిధ్యం దెబ్బతింటుందని, పర్యావరణ చక్రం అస్తవ్యస్తంగా మారి రుతువులు గతి తప్పొచ్చని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. చెట్లపై ఆధారపడి నివసించే లక్షలాది పక్షులు, క్రిమికీటకాలు, జంతువుల అస్థిత్వానికే ముప్పు వాటిళ్లవచ్చని హెచ్చరించింది. భూమి మీద చెట్ల సంఖ్య తగ్గిపోతే మట్టి కొట్టుకుపోయి నగరాలపై వరదలు ముంచెత్తవచ్చని, ఇది ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయవచ్చని తెలిపింది.