శ్రీనగర్: జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లోని దోడాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. గత రాత్రి ఆర్మీ బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత భద్రతా దళాలు కౌంటర్ అటాక్‌కు దిగాయి. ఆ ఎదురుకాల్పుల్లో అయిదుగురు సైనికులు, ఓ స్పెషల్ పోలీసు ఆఫీసర్‌కు గాయాలు అయ్యాయి. గడిచిన మూడు రోజుల్లో జమ్మూలో కాల్పులు జరగడం ఇది మూడవసారి. తొలుత కథువాలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఓ పౌరుడు గాయపడ్డాడు. ఇక రియాసి జిల్లాలో భక్తులతో వెళ్తున్న బస్సుపై అటాక్ చేశారు. ఆ కాల్పుల్లో 9 మంది ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే.
కథువాలో గత రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని కాల్చివేసినట్లు జమ్మూ జోన్ ఏడీజీపీ ఆనంద్ జెయిన్ తెలిపారు. దోడాలోని చత్తర్‌గాలా ఏరియాలో ఉన్న ఆర్మీ బేస్‌పై గత రాత్రి ఉగ్రవాదులు దాడి చేసినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రీయ రైఫిల్స్‌తో పాటు పోలీసులు ఉన్న జాయింట్ పార్టీపై అటాక్ జరిగిందన్నారు. ఉగ్రవాదం నుంచి ఫ్రీగా ఉన్నాయనుకున్న జమ్మూ ప్రాంతాల్లో ఇప్పుడు దాడులు జరగడం శోచనీయంగా మారింది.
కథువాలో తప్పించుకున్న ఓ ఉగ్రవాదిని అన్వేషించేందుకు అధికారులు డ్రోన్లు వాడుతున్నట్లు తెలిసింది. కథువాలో ఉగ్రవాదులు చొరబడ్డారని, దీనికి పాకిస్థాన్ కారణమని ఆనంద్ జెయిన్ తెలిపారు.