న్యూఢిల్లీ, జూన్ 6: దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్‌ను టెలికాం విభాగం శుక్రవారం జారీ చేసింది. దీంతో ఈ లైసెన్స్ పొందిన మూడో కంపెనీగా స్టార్ లింక్ నిలిచింది. యూటెల్సాట్ వన్‌వెబ్, రిలయన్స్ జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్‌లు ఇప్పటికే లైసెన్స్ పొందాయి. నాలుగో సంస్థ అమెజాన్ క్యూపిర్ అనుమతి కోసం వేచి చూస్తున్నది.
స్టార్ లింక్‌నకు లైసెన్స్ మంజూరైందని, ఆ సంస్థ దరఖాస్తు చేసుకున్న 15-20 రోజుల్లోనే ట్రయల్ స్పెక్ట్రమ్ మంజూరు చేస్తామని డాట్ వర్గాలు వెల్లడించాయి. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ అనుబంధ సంస్థ అయిన స్టార్‌లింక్ వివిధ దేశాల్లో ఇంటర్నెట్ సర్వీసులను 2002లోనే ప్రారంభించింది. శాటిలైట్ టెక్నాలజీతో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడానికి సిద్ధమైంది. సుదూర భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడే సంప్రదాయ ఉపగ్రహ సేవల మాదిరిగా కాకుండా లియో ఉపగ్రహాల ద్వారా స్టార్‌లింక్ ఈ సేవలను అందించనున్నది. భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కక్ష్యలో స్టార్‌లింక్‌నకు చెందిన 6వేల ఉపగ్రహాలు పరిభ్రమిస్తుంటాయి.