Elephants | హైదరాబాద్, మార్చి 2 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): భారీ కాయంతో గంభీరంగా కనిపించే ఏనుగులకు కూడా మనుషులకు ఉన్నట్టే భావోద్వేగాలు అమితంగా ఉంటాయని, బిడ్డ చనిపోతే తట్టుకోలేనంత గర్భశోకానికి అవి గురవుతాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. మనుషులు చేసినట్టే చనిపోయిన పిల్ల ఏనుగుల మృతదేహాలకు పద్ధతి ప్రకారం ఏనుగులు అంత్యక్రియలను నిర్వహిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మేరకు 2022, 2023లో బెంగాల్లో ఉండే 15 నుంచి 20 ఏనుగులకు సంబంధించి ఐదు కేసులను విశ్లేషించినట్టు అధ్యయనంలో భాగమైన ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాణ్, ఆకాశ్‌దీప్ రాయ్ పేర్కొన్నారు. ఈ వివరాలు ‘థ్రెటెన్డ్ టాక్సా’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
చనిపోయిన బిడ్డ ఏనుగును చూసిన తల్లి ఏనుగు, తండ్రి ఏనుగు ఆ మృతదేహాన్ని తొండం, ముందరి కాళ్లతో నెమ్మదిగా తడుముతూ గట్టిగా రోదిస్తాయని పరిశోధకులు తెలిపారు. ఆ తర్వాత మానవ సంచారం లేని ప్రాంతానికి ఆ బిడ్డ మృతదేహాన్ని తొండం సాయంతో ఏనుగుల గుంపు తరలిస్తుంది. పొలాలు లేదా టీ ఎస్టేట్ లేదా కాలువ గట్టున ఉన్న నిర్మానుష్యమైన చదునైన ప్రాంతంలో గోతిని తవ్వి.. పిల్ల ఏనుగు ముందరి కాళ్లు పైకి కనిపించేలా ఉంచి నెమ్మదిగా కప్పి పెడుతుంది. ఆ తర్వాత దగ్గర్లోని నీటిలో ఏనుగుల గుంపు స్నానాలు ఆచరిస్తాయి. పిల్ల ఏనుగును పూడ్చిపెట్టిన ప్రాంతానికి ఇంకెప్పుడూ ఆ గుంపు రాబోదని పరిశోధకుల బృందం తెలిపింది. మరణించిన పిల్ల ఏనుగుల విషయంలోనే ఏనుగులు ఈ క్రతువును జరుపుతాయని, పెద్ద ఏనుగుల విషయంలో జరిపినట్టు ఆధారాలు లేవని వెల్లడించింది. పెద్ద ఏనుగును తరలించడం, పూడ్చడం కష్టమైన పని కావడమే దీనికి కారణమై ఉండొచ్చని అభిప్రాయపడింది.