బెంగళూరు: భారీ సైజులో ఉండే ఏనుగులు కంచెను దాటలేవని మనం భావిస్తే పొరపాటు పడినట్లే. ఏనుగులు తలుచుకుంటే ఏ పని అయినా చేయగలవు. అడ్డుగా ఉండే ఎత్తైన కంచెను సైతం సులువుగా దాటగలవు. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్లో బుధవారం దీనికి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇనుప ప్రేమ్‌లతో ఏర్పాటు చేసిన ఎత్తైన ఫెన్సింగ్‌ను ఒక భారీ ఏనుగు ఈజీగా దాటేసింది. తొలుత కంచె దాటడం ఏనుగుకు కాస్త కష్టంగా అనిపించింది. అయితే కొంత సేపటి తర్వాత ముందరి కాళ్లను ఫెన్సింగ్ అవతలకు పెట్టి సునాయసంగా దాటింది.
కర్ణాటకలోని మైసూరు సమీపంలో నాగరహోళే టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 16న పంటపై దాడి అనంతరం ఏనుగు అడవికి తిరిగి వస్తున్నప్పుడు అడ్డుగా ఉన్న కంచెను ఇలా దాటినట్లు నాగరహోళే టైగర్ రిజర్వ్ డైరెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.
కాగా, ఏనుగు కంచెను అతి సులభంగా దాటిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 27 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 1.86 లక్షల మంది వీక్షించారు. 15,500 మందికిపైగా లైక్ చేశారు. నెటిజన్లు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు. మరోవైపు అటవీ ప్రాంతంలో ఏనుగులకు ఇబ్బందిగా అనిపించే అలాంటి ఫెన్సింగ్‌లను తొలగించాలని పలువురు డిమాండ్ చేశారు.
Speechless 😶 #elephants pic.twitter.com/6S1WJqEkZS
— Supriya Sahu IAS (@supriyasahuias) November 17, 2021