న్యూఢిల్లీ, మే 26: చిన్న, సన్నకారు రైతులు అతి తక్కువ ఖర్చుతో పొలం పనులు చేసుకునేందుకు ఉపయోగపడే విద్యుత్తుతో నడిచే టిల్లర్ అందుబాటులోకి వచ్చింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్(సీఎస్ఐఆర్) ఆధీనంలో పనిచేసే సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎంఈఆర్ఐ) ఈ ఎలక్ట్రిక్ టిల్లర్ను తయారుచేసింది. దీనిని శనివారం దుర్గాపూర్లో ఆవిష్కరించారు. రెండు హెక్టార్లలోపు వ్యవసాయ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఇది సమర్థంగా పని చేస్తుందని, దీనికి ప్లవ్, ఐరన్ వీల్స్, కల్టివేటర్, రిడ్జర్ వంటి వ్యవసాయ పనిముట్లను అమర్చుకొని పొలం పనులు చేసుకోవచ్చని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ టిల్లర్ వినియోగం వల్ల దాదాపు 85 శాతం ఖర్చు తగ్గుతుందని, దీనికి సోలార్ డీసీ, ఏసీ చార్జింగ్ సదుపాయాలు ఉన్నట్టు తెలిపింది. 500 కిలోల బరువును సైతం ఈ టిల్లర్ మోయగలదని, దీనికి ట్రాలీ జత చేసి ఉంటుందని పేర్కొన్నది.