న్యూఢిల్లీ, ఆగస్టు 16: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దాదాపు దశాబ్దకాలం తర్వాత ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2019లో ఆర్టికల్ 370 తొలగించి, జమ్ము కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు.. జమ్ము కశ్మీర్‌తో పాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీకి చివరగా 2014 నవంబరు-డిసెంబరులో ఐదో దశల్లో ఎన్నికలు జరిగాయి. జమ్ము కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబరు 30 లోపు ఎన్నికలు జరపాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
2019లో హర్యానాతో పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగినా ఈసారి మాత్రం ఆ రాష్ట్ర ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించలేదు. జమ్ము కశ్మీర్ ఎన్నికల కోసం భద్రతా ఏర్పాట్లను దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర ఎన్నికలకు ఇప్పుడు షెడ్యూల్ విడుదల చేయలేదని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. జమ్ము కశ్మీర్, హర్యానా ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేయనుంది.