న్యూఢిల్లీ: భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సరైన సమయంలో జమ్ముకశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం ప్రకటించింది. తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ సోమవారం వెల్లడించింది. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జమ్ముకశ్మీర్ ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు. ‘కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లో భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ‘సరైన సమయం’గా కమిషన్ భావించినప్పుడు ఎన్నికలు నిర్వహిస్తాం’ అని అన్నారు.
కాగా, రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలపై కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ మాట్లాడారు. మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ , ఉచితాల ప్రకటనలు ఎల్లప్పుడూ ప్రజాకర్షణ కలిగి ఉంటాయని చెప్పారు. అయితే ఉచితాలు ఎక్కడ నుంచి వస్తాయో అన్నది తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని అన్నారు.